ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : ప్రతి కుటుంబ సభ్యుని అవసరాలను తప్పక గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమాల ద్వారా మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది ఉందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని వెంకంపేట, తాళ్లబురిడి గ్రామ సచివాలయాల్లో శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష క్యాంప్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముందుగా జగనన్న సురక్ష క్యాంప్ ఆవశ్యకతను, అవసరాన్ని ప్రజలకు వివరించి, కొత్తగా మంజూరై ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి బి.రేవతమ్మ, వైస్ ఎంపిపి సిద్ధ జగన్నాధరావు, పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, ఎంపిడిఒ ఎస్.రమేష్, తహశీల్దార్ శివన్నారాయణ, సర్పంచులు వై.ప్రమీల, గండి శంకరరావు, ఎంపిటిసి సభ్యులు బంకురు రవికుమార్, మండల సీనియర్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానికులు పాల్గొన్నారు.
సాలూరు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడానికే జగనన్న సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. శుక్రవారం పట్టణంలోని ఆర్యవైశ్య ధర్మశాలలో 18, 19, 20, 21, 22 వార్డులకు సంబంధించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 11రకాల ధ్రువపత్రాలను విద్యార్థులకు, మహిళలకు అందజేశారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన ధ్రువపత్రాలను వెంటనే మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, వార్డు ఇంఛార్జిలు పిరిడి రామకృష్ణ, పి.వాసుదేవరావు, కమిషనర్ హెచ్ శంకరరావు , వైసిపి నాయకులు హరి బాలాజీ, పువ్వుల శ్రీనివాస్ భరత్ పాల్గొన్నారు.
కురుపాం : జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులై ఉండీ సంక్షేమ పథకాలకు మిగిలి ఉన్న వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఎంపిడిఒ వివి శివరామప్ప అన్నారు. మండలంలోని నీలకంఠాపురం పంచాయతీలో సర్పంచ్ ఎస్.మన్మధరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండీ ఇంకా మిగిలి ఉన్న వారు జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కావున లబ్ధిదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి బి.అన్నాజీరావు, ఎఎంసి మాజీ చైర్మన్ ఎన్.వెంకట్రావు, ఎంపిటిసి సభ్యులు రాజేశ్వరి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










