Jul 13,2023 21:53

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి- బలిజిపేట : అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అవసరమైన సేవలన్నింటినీ అందజేసి మేలు చేకూర్చాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బలిజిపేట మండలంలోని చిలకలపల్లి, నూకలవాడ గ్రామ సచివాల యాల పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష శిబిరాలను గురువారం పరిశీలించారు. జగనన్న సురక్ష కార్యక్రమం అమలు, అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టోకెన్లు జారీ, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. జగనన్న సురక్ష ద్వారా అందుతున్న సేవలను లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి.. లబ్ది, సంతృప్తి స్థాయి, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవసరమైన ధ్రువపత్రాలు లేక ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరూ దూరం కాకూడదని చెప్పారు. అర్హులు మిగలకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు లబ్దిపొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం జగనన్న సురక్ష ద్వారా మంజూరు చేసిన ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్‌ లబ్ధిదారులకు అందజేశారు. ల్యాండ్‌ రీ సర్వేలో భాగంగా మ్యుటేషన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

వరి నారుమడి పరిశీలన
నూకలవాడ రైతు భరోసా కేంద్ర పరిధిలోని వరినాట్లు వేసిన పొలాలను కలెక్టర్‌ పరిశీలించారు. భూసారం కోసం పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పచ్చిరొట్ట, జీలుగ విత్తనాల ఉపయోగాలను జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌ పాల్‌.. కలెక్టర్‌కు వివరించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత మేరకు వరి విత్తనాలు, పచ్చిరొట్ట, జీలగ విత్తనాలు అందాయన్న విషయాలను రైతు ముంజేటి ఈశ్వరరావును అడిగి ఆరా తీశారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న టెలివిజన్‌లో పంటల సాగుకు పాటించవలసిన మెళకువలు, జాగ్రత్తలకు సబందించిన వీడియోల ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడివాడ నాగమణి, జెడ్‌పిటిసి ఎ.రవికుమార్‌, వైస్‌ ఎంపిపి వి.సాయిరాం, తహశీల్దార్‌ అప్పలరాజు, ఉప తహశీల్దార్‌ రత్నకుమారి, సర్పంచ్‌ వెంకటరమణ, ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ కురిటి లక్ష్మునాయుడు, ఎఒ శ్రావణ్‌ కుమార్‌ నాయుడు, విఎఎ మణికృష్ణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
వివిధ సమస్యలపై కలెక్టర్‌ కు ఫిర్యాదు
చిలకలపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్‌కు పలు సమస్యలపై గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. మూడు సంవత్సరాలుగా పెదంకలాం ప్రాజెక్టు నుంచి శివారు భూములకు నీరు అందడం లేదని విన్నవించారు. ధ్రువపత్రాల మంజూరులో జాప్యంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పింఛను అందడం లేదని వృద్ధురాలు చింతాడ పార్వతి కలెక్టర్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే కలెక్టర్‌ స్పందించి అక్కడున్న డిటి రత్నకుమారిని వివరణ అడిగారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
తహశీల్దార్‌పై అసంతృప్తి
నూకలవాడ సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష ద్వారా ధ్రువపత్రాలు మంజూరు చేయడంలో తహశీల్దార్‌, సిబ్బంది విఫలం కావడంపై కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అన్ని మండలాల్లో 90 శాతంపైగా వినతులు పూర్తిచేస్తే, బలిజిపేటలో 50 శాతం కన్నా తక్కువగా ఉందని అసహనం వ్యక్తంచేశారు. అనంతరం సచివాలయంలో ఒకగదిలోకి తహశీల్దార్‌ అప్పలరాజును కలెక్టర్‌ తీసుకెళ్లి మందలించినట్లు తెలిసింది. ధ్రువీకరణ పత్రాలు సంబంధించి మంజూరు విషయంలో కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసి, వెనుదిరిగిన అరగంటలో 187 ధ్రువపత్రాలను సిబ్బంది లబ్ధిదారులకు అందజేయడం గమనార్హం. నేరుగా కలెక్టర్‌ వచ్చి అధికారులపై చర్యలు తీసుకుంటే గాని రెవెన్యూ పనులు జరగడం లేదని అక్కడున్న ప్రజలు చర్చించుకుంటున్నారు.