Jun 22,2023 23:47

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బియ్యం కార్డులు, పింఛన్ల పునరుద్ధరించాలని ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు లక్ష కుటుంబాల ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈనెల 24 నుంచి జరగనున్న జగనన్న సురక్ష పథకం ద్వారా వీరికి కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా సురక్ష కార్యక్రమం ద్వారా కుటుంబ మ్యాపింగ్‌ విభజనకు అవకాశం కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో ఒకే బియ్యం కార్డులో అందరూ ఉండడంతో అనర్హులైన వారు ఉన్నారంటూ ఆ కుటుంబంలోని మిగతా వారికి బియ్యం కార్డు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు నిలిపేశారు. ఇందువల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే నివేదికలతో సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.
సంక్షేమ పథకాలకు ప్రతి బంధకంగా మారిన ఆరు సూత్రాల విధానం వల్ల చాలామంది అర్హులకు పథకాలు అందడం లేదు. కుటుంబంలో ప్రభుత్వం పింఛను ఎవరున్నా వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛను అందడం లేదు. ఒకే కుటుంబానికి ఒకే పింఛను విధానం వల్ల అత్త, కోడలు, వితంతువులు అయితే ఎవరో ఒకరికే పింఛన్లు అందుతున్నాయి. మరొకరికి ఇవ్వడం లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటున్నా కుమారుడు లేదా కుమార్తె విదేశాల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే తల్లిదండ్రుల బియ్యం కార్డుని నిలిపివేయడం వల్ల వారు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. కార్డులో ఉన్న ఒక వ్యక్తి కారు ఉన్నా బియ్యం కార్డు తొలగించారు. మూడు నాలుగు పోర్షన్లకు కలిపి ఒకే మీటరు ఉండటం వల్ల 300 యూనిట్లు దాటితే వారికి కార్డు తొలగించారు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన ఇల్లు ఉన్నా రేషన్‌ కార్డు ఉండటం లేదు. ఇలా పలు రకాల ఆంక్షలతో రేషన్‌ కార్డులు తొలగించడం వల్ల అనేక సంక్షేమ పథకాలను అర్హులు కూడా పొందలేకపోతున్నారు.
ఇందుకు సంబంధించి పలు రూపాల్లో ప్రభుత్వం సురక్ష ద్వారా పరిష్కారం చూపిస్తూ వెలుసుబాటును ఇచ్చింది. దీంతో అనర్హులను కార్డు నుంచి తొలగించి మిగతా వారికి బియ్యం కార్డు పునరుద్ధరణకు అవకాశం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇందుకు గాను గతంలో ఉన్న కుటుంబ మ్యాపింగ్‌ విభజనకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈమేరకు పలుమార్గదర్శకాలు జారీచేశారు. దీంతోపాటు సచివాలయాల ద్వారా 11 రకాల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక కొంత మంది సంక్షేమ పథకాలను సకాలంలో పొందలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం వారంలోగా ధ్రువీకరణ పత్రాల జారీకి అవకాశం కల్పించారు. వీటిల్లో కుల, ఆదాయ, పుట్టిన, మరణించిన, నివాస ధ్రువీకరణ, స్థలాలు, పొలాలకు మ్యూటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఈడబ్ల్యూఎస్‌, ఆధార్‌ కార్డులకు మొబైల్‌ నెంబరు అనుసంధానంతో కూడిన అప్‌డేట్‌, పుట్టిన తేదీ, కొత్త రేషన్‌ కార్డులు, తదితర ధ్రువీకరణ పత్రాలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 23 వరకు సచివాలయాల నుంచి జారీ చేయాలని నిర్ణయించారు.
కొంత కాలంగా వాలంటీర్లు స్థానికంగా ఉండకుండా కేవలం ఒకటో తేదీన సామాజిక పింఛన్లు పంపిణీకి పరిమితమై ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అందువల్ల ప్రభుత్వ సేవల్లో మందగమనం పెరిగిందన్న ఫిర్యాదులు వెళ్లాయి. ఇందువల్ల సచివాలయాల నుంచి సకాలంలో సేవలు అందడం లేదన్న నివేదికల నేపథ్యంలో సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్కో వాలంటీరుకు ఒక్కో సచివాలయ ఉద్యోగి, ఇతర అధికారులను కేటాయించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.