Jul 01,2023 00:04

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


ప్రజాశక్తి-పాడేరు: ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న జగనన్న సురక్ష పధకాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తహసిల్దార్లను, ఎంపిడిఓలను, మండల ప్రత్యేకాధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుండి నిర్వహించిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తక్కువ సమయంలో మెరుగైన సేవలు అందించవచ్చని, దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ముందుగానే వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు గుర్తించి సచివాలయాల ద్వారా 11 రకాల ధ్రువపత్రాలు జారీకి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తహసిల్దార్‌, ఎంపిడిఓల ఆద్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సచివాలయ ఫరిధిలో శిభిరాలు నిర్వహించి అవసరమైన ధృవ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పధకంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కలక్టర్‌ సూచించారు. శిభిరాల వివరాలు ముందుగానే ఆయా గ్రామాల ఫరిధిలో ప్రచారం చేయటంతో పాటు, ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చాలని, వారి సలహాలు, సూచనలు తీసుకో వాలని ఆదేశించారు. గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి టోకెన్‌ జనరేట్‌ చేయాలని, అందుకు అనుగుణంగా సంబందిత డాక్యుమెంట్లతో సచివాలయంలో ఆన్‌ లైన్‌ చేసి వెంటనే వెరిఫికేషన్‌ చేయాలన్నారు.అవసరమైన కంప్యూటర్‌, లేప్‌ టాప్‌, స్కేనర్‌, ప్రింటర్‌ ధృవపత్రాల జారీకి అవసరమైన హై సెక్యూర్డ్‌ పేపర్‌, తదితరాలను సిద్ధం చేసుకోవాలని, వీలైనన్ని ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆదార్‌, బ్యాంకు ఖాతా లింకేజ్‌ కు సంబంధించి కౌంటర్‌ ఏర్పాటు చేసి బ్యాంకర్లను ఆహ్వానించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలక్టర్‌ జే.శివ శ్రీనివాసు, సహాయ కలక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ, మండల ప్రత్యేకాదికారులు వి. మురళి, కొండలరావు, వి.ఎస్‌.కుమార్‌, పి.గోవింద రాజులు, ఎన్‌. సూర్యలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్‌ సునీల్‌ పాల్గొన్నారు.