Jun 23,2023 22:53

ప్రజాశక్తి-కాకినాడ అర్హత ఉన్న ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికీ వెళ్లి మరీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ కతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, జిల్లాలోని వివిధ ప్రాంతాల గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగనన్న సురక్ష పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులకు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్యక్రమం అమలుకు సంబంధించి అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ఈ నెల 24 నుంచి వారం, పది రోజులపాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయంతో ప్రతి ఇంటినీ సందర్శించనున్నట్లు తెలిపారు. అర్హత ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే గుర్తించి, సమస్య పరిష్కారానికి దరఖాస్తులు నింపి, అవసరమైన పత్రాలను సేకరిస్తారన్నారు. జులై 1వ తేదీ నుంచి తహసీల్దార్‌, ఇఒపిఆర్‌డితో కూడిన ఒక బందం, ఎంపిడిఒ, డిటిలతో కూడిన మరో బందం సచివాలయాల వారీగా క్యాంపులు నిర్వహించి అక్కడికక్కడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఆధార్‌కు ఫోన్‌ నెంబరు అనుసంధానం, సిసిఆర్‌సి కార్డులు, కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, కుటుంబ వివరాల్లో మార్పులు వంటి 11 రకాల సేవలను ఉచితంగా అందించనున్నట్లు వివరించారు. నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో జగనన్న సురక్ష శిబిరాల ఏర్పాటుకు వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులకు, సిబ్బందికి సూచించారు. తాగునీరు, భోజన సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి డిఎస్‌ సునీత, సిపిఒ పి.త్రినాథ్‌ పాల్గొన్నారు.