ప్రజాశక్తి -భీమునిపట్నం : ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న జగనన్న సురక్ష పథకం లక్ష్యాన్ని వివరిస్తూ మండల పరిధిలోని వివిధ విభాగాల అధికారులకు శనివారం స్థానిక ఎండిఒ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు వివిధ పథకాలకు అర్హత కలిగిన లబ్ధిదారుల పేర్లను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని చెప్పారు. మండల కమిటీల పర్యవేక్షణలో ఆయా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. పథకం విధి విధానాలు వివరించారు. ఈ సమావేశంలో పంచాయతీ విస్తరణాధికారి జి.అప్పలరాజు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మండలంలో 13 సచివాలయాలు ఉండగా, ఇందులో 9 సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణకు ఎండిఒ పి.వెంకటరమణ, మిగిలిన 4 సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణకు తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్ పర్యవేక్షణలో కమిటీలు ఏర్పాటుచేశారు.
ఆనందపురం: ఆనందపురం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఒ అడప లవరాజు ఆధ్వర్యాన 'జగనన్న సురక్ష' పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆనందపురం మండల పరిధిలో ఉన్న 18 సచివాలయాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న అన్నీ కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను సచివాలయానికి అందజేయాలని తెలిపారు. ఆ సమస్యలను శాఖల వారీగా పరిష్కరించే దిశగా మండల స్థాయి అధికారులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అడప లవరాజు, ఇన్‌ఛార్జి ఇఒపిఆర్‌డి కరుణాకర్‌రావు, కార్యదర్శులు శ్రీరామ్‌మూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










