Jun 27,2023 22:41

ప్రజాశక్తి - ఆగిరిపల్లి
          జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల ందరూ వినియో గించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ కోరారు. మంగళవారం ఆయన మండలంలోని చిన ఆగిరిపల్లిలో వాలంటీర్లు నిర్వహిస్తున్న జగనన్న సురక్ష ఇంటింటి సర్వేను నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌తో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం జులై ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకూ నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కు ఫోన్‌ నెంబరు అనుసంధానం, సిసిఆర్‌సి కార్డులు వంటి 11 రకాల సేవలు ఎటువంటి రుసుమూ లేకుండా ఉచితంగా అందజేస్తారన్నారు. ఆయా గ్రామాల్లో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమం షెడ్యూల్‌ను గ్రామ సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అనంతరం ఆయన జగనన్న సురక్ష ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీంచారు. వరహా పుష్కరిణి వద్ద జరుగుతున్న పనులను, వడ్లమాను గ్రామంలో జగనన్న ఇళ్ల కాలనీల్లో పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి.వెంకటరత్నం, తహాశీల్దార్‌ ఎం.ఉదయభాస్కరరావు, ఎంపిడిఒ పి.శంకరరావు, హౌసింగ్‌ ఎఇ అలీముల్లా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.