ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌బాషా తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జగనన్న సురక్ష కార్యక్రమంపై విస్తత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. సమగ్ర ప్రణాళికతో అధికారులు పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుందని అన్నారు. ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లాలని చెప్పారు. ఇందుకోసం మండల స్థాయిలో తహశీల్దారు, ఎంపీడీవో ఒక బృందం గాను, ఈవోపిఆర్‌డి, ఉప తహశీల్దారు, ఆర్‌ఐ హౌదాలో మరొకరితో కలిపి బృందంగా ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్, ఉపతహశీల్దారు బృందంలో ఉండేలా అధికారులు చూడాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా అధికారులు సచివాలయాల వద్ద శిబిరాలు ప్రారంభించాలని ఆదేశించారు. 19వ తేదీన గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో విధిగా రిజిస్ట్రేషన్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అవగాహన కల్పిస్తూ సిటిజన్ ఫ్రెండ్లీ కార్యక్రమం జరపాలన్నారు. గ్రామ సచివాలయాల వారీగా పౌరుల గృహాలను అధికారులు సందర్శించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కుల, ఆదాయ, కుటుంబ, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు అక్కడికక్కడే జారీ చేయాలన్నారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియతోపాటు సిసిఆర్‌సి కార్డులను కౌలు రైతులకు అందించాలన్నారు. నాలుగు వారాల్లో ప్రణాళికాబద్ధంగా అన్ని సచివాలయాల పరిధిలో కార్యక్రమాన్ని విధిగా జరపాలని అన్నారు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. కార్యక్రమాల నిర్వహణపై మండల స్థాయిలో సమగ్ర ప్రణాళిక నివేదికను శనివారం సాయంత్రానికి కలెక్టరేట్‌కు పంపాలన్నారు. కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణపై ప్రత్యేక బృందాలు పనిచేస్తాయన్నారు. ఆర్డీవోలు వారంలో నాలుగు శిబిరాలకు విధిగా హాజరు కావాలన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మార్గ నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










