Aug 01,2023 23:07

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

- జిల్లాలో 3,27,343 ధ్రువపత్రాలు పంపిణీ
- రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానం
- జనం నుంచి విశేష స్పందన
- కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష ద్వారా జిల్లాలో 6,75,707 కుటుంబాలను సర్వే చేశామని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7,33,037 కుటుంబాలు ఉండగా, అందులో 92 శాతం మేర సర్వే పూర్తి చేశామని చెప్పారు. సర్వే సమయంలో ఇళ్లలో ఎవరూ అందుబాటులో ఉండకపోవడం, వలసలు వంటి కారణాలతో మిగిలిన ఎనిమిది శాతం సర్వే చేయలేకపోయామని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 732 సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవసరమైన ధ్రువపత్రాల కోసం సర్వే చేశారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలను అందించామన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా 3,04,023 ధ్రువపత్రాలు, 19705 మందికి ఆధార్‌, పౌరసరఫరాల శాఖ ద్వారా 2,392 మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 527, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా 314, వ్యవసాయశాఖ ద్వారా 162 మందికి అవసరమైన సర్టిఫికేట్లను అందించామని వివరించారు. రిజిస్ట్రేషన్‌, స్టాంపులు శాఖ ద్వారా 116 మందికి, గ్రామీణాభివృద్ధి శాఖ 70, మున్సిపాలిటీలు 19, కార్మిక శాఖ ద్వారా ఆరుగురికి, ఇపిడిసిఎల్‌ ద్వారా ఐదుగురికి, పోలీసు శాఖ ద్వారా నలుగురికి ధ్రువపత్రాలు జారీ చేశామని చెప్పారు. సాధారణంగా పలురకాల ధ్రువపత్రాల జారీకి కొంత మొత్తం రుసుముగా తీసుకోవడం జరుగుతుందని, జగనన్న సురక్షలో అన్నీ సేవలూ ఉచితంగానే అందించామని తెలిపారు. తద్వారా ప్రజల నుంచి వసూలు చేయాల్సిన రూ.1.62 కోట్లను ప్రభుత్వమే భరించిందని చెప్పారు. సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చాలా తేలిగ్గా ధ్రువపత్రాలు పొందడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కుటుంబాల సర్వేలో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచామని చెప్పారు. ధ్రువపత్రాల జారీ, సేవల విషయంలో రాష్ట్రంలో మూడో స్థానం దక్కిందని తెలిపారు. జగనన్న సురక్షలో రోడ్లు, కాలువల నిర్మాణం వంటి వినతులు వచ్చాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి వాసుదేవరావు పాల్గొన్నారు.