Jul 17,2023 20:58

స్పందనలో అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

'జగనన్న సురక్ష'కు గైర్హాజరయితే చర్యలు
- స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       జగనన్న సురక్ష క్యాంపులకు అధికారులు గైర్హాజరయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ హెచ్చరించారు. కొంతమంది నియోజకవర్గ స్పెషల్‌ అధికారులు, మండల స్థాయి బృందాలు మొక్కుబడి రీతిలో హాజరవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు పరిధిలోనే ఉండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టరుతో పాటు డిఆర్వో పుల్లయ్య తదితర జిల్లాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న జగనన్న సురక్ష క్యాంపులకు హాజరై సర్వీస్‌ రిక్వెస్ట్‌లను క్లియర్‌ చేయడంతో పాటు స్థానిక కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి చేపట్టాల్సిన అంశాలపై సిఫారసు చేయాలని నియోజకవర్గ స్పెషల్‌ అధికారులు, టాస్క్ఫోర్స్‌ బృందాలకు సూచించారు. అప్పగించిన విధుల్లో అలసత్వం చూపే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. సర్వీస్‌ రిక్వెస్ట్‌లకు సంబంధించిన ధ్రువపత్రాల జారీకి సంబంధిత అధికారులకు బాధ్యత అప్పగించి ఫాలో అప్‌ చేయాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం ఆడిట్‌లో పెండింగ్‌ ఉన్న 959 ఈకేవైసీని నియోజకవర్గాల వారీగా విభజించి మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు సిసిఆర్సి కార్డుల జారీకి పెండింగ్లో ఉన్న 49 శాతం పంపిణీకి ఆర్‌బికెల వారీగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంకా ప్రారంభించని 131 పనులు గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను సత్వరమే నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా సంబంధిత అధికారులు తప్పనిసరిగా పరిష్కరించా లన్నారు. కార్యక్రమంలో 225 మంది తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లాస్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.