
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షగా మారింది. ఈ శిబిరాల వద్ద స్టాళ్లను ఏర్పాటు చేసి పౌష్టికాహారంతో కూడిన పదార్థాలను ప్రదర్శించాలన్నది ఉన్నతాధికారుల ఆదేశాలు. జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన వారందరికీ అంగన్‌వాడీలు తయారు చేసిన వంటల రుచి చూపించడంతోపాటు వాటిలోని పౌష్టికాహారం గురించి వివరించే బాధ్యత వారిదే. అయితే తయారీకి ఎటువంటి బడ్జెట్‌ను కేటాయించలేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు సొంత ఖర్చులతో సామలు, కొర్రలు, కూరగాయలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి వాటితో పౌష్టికాహార పదార్థాలను తయారు చేసి స్టాళ్ల వద్దకు తీసుకు వస్తున్నారు. దీనివల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 20 రోజులుగా అధికారుల వేధింపులు తాళలేక అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 7 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1536 మెయిన్, 26 మినీ అంగన్ వాడీ కేంద్రాలు మొత్తం 1562 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాల వద్ద హెల్ప్‌డెస్క్, రోగుల పేర్ల రిజిస్ట్రేషన్, మందుల పంపిణీ, వైద్య పరీక్షలు, ఆరోగ్యమిత్ర, కంటి వైద్య నిపుణులు, నలుగురు వైద్యుల గదులు.. ఇలా పలు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రోగులకు సహాయం అందించే బాధ్యతను ఆశ కార్యకర్తలకు, స్టాళ్లను ఏర్పాటు చేసి పోషక పదార్థాలను ప్రదర్శించే బాధ్యతను అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉన్నతాధికారులు అప్పగించారు.
అయితే, పౌష్టికాహారం తయారు చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వలేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలే సొంత డబ్బులతో తమ వద్ద లేని పోషక పదార్థాలను మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని వాటిని వండి శిబిరాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఒక్కో శిబిరానికి రూ.7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పు చేసి పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు సురక్ష శిబిరాల వద్ద స్టాళ్ల నిర్వహణతో మరింత అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, అధికారులకు బిల్లులు అడగలేక సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు ఒత్తి డి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ డబ్బులతో సరుకులను కొనుగోలు చేసి పౌష్టి కాహారం తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. మండలాల్లో ఎక్కడ సురక్ష శిబి రాలు జరిగినా సంబంధిత మండలాల ఆశా వర్కర్లు అక్కడకు రావాలని అధికారులు చెబుతున్నారు. ఒక్కో కార్యకర్త రూ.100 వరకు చార్జీలు చెల్లించి శిబిరాల వద్దకు చేరుకుంటున్నారు. వీరికి రవాణా ఖర్చులను ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అంగన్‌వాడీల ఇబ్బందులపై దృష్టి సారించి పౌష్టికాహారం తయారీకి బడ్జెట్, ప్రయాణ ఖర్చులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆహార పదార్ధాల తయారీకి బడ్జెట్ కేటాయించాలి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పౌష్టికాహర పదర్ధాలను ప్రదర్శించి, అక్కడికి వచ్చే వారికి రుచి చూపించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. ఇది సరైందికాదు. .ఫేస్ రీడింగ్ తదితర యాప్‌ల నిర్వహణతో ఇప్పటికే అంగన్‌వాడీలు ఒత్తిడికి గురవుతు న్నారు. తాజా నిర్ణయంతో ఆర్ధిక భారం తాళలేక అప్పులు చేయాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు దృష్టి సారించి బడ్జెట్ కేటాయించాలి.
-కెఎం.బేబిరాణి, కార్యదర్శి, అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, తూర్పు గోదావర జిల్లా.