Jun 22,2023 22:29

         బుట్టాయగూడెం:అధికారులు ఆలస్యంగా వచ్చారని, అధికారులు అందరూ రాలేదని అసంతృప్తితో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు జగనన్న సురక్ష అవగాహనా సమావేశాన్ని బహిష్కరించిన ఘటన గురువారం బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగనన్న సురక్ష కార్యక్రమంపై స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు రాకపోవడం, ఒక అధికారి ఆలస్యంగా రావడంపై అప్పుడే సమావేశానికి విచ్చేసిన ఎంపిటిసిలు, సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సమావేశం బహిష్కరిస్తున్నామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఎంపిడిఒ వేణుగోపాల్‌రెడ్డి, తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతి ప్రజాప్రతినిధులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అందరు అధికారులతో మరో రోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం శాంతి, జెడ్‌పిటిసి మొడియం రామతులసి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.