ప్రజాశక్తి-పాడేరు:అర్హత కలిగిన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని తహశీల్దారులు, ఎంపిడిఓలు, వెలుగు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న సురక్ష పథకం అమలు, విధి విధానాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల స్థాయిలో ఎంపిడిఓలు, తహశీల్దారులు వేరు వేరుగా రెండు బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బృందాలలో మండల స్థాయి అధికారులను సభ్యులుగా చేర్చాలన్నారు. ముందుగా పర్యటన షెడ్యూలు తయారు చేసుకోవాలని సూచించారు. ఈనెల 20 జగనన్న సురక్ష పథకం అమలుపై శిక్షణా తరగతులు నిర్వహిం చాలన్నారు. ఈనెల 24వ తేదీ గ్రామ సచివాలయాలు సందర్శించి జగనన్న సురక్ష పథకంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఈనెల 24 నుండి సెక్రటేరియట్ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలై 1.వ తేదీ నుండి సచివాలయం స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, కుటుంబ సభ్యుడి దృవీకరణ పత్రాలు, మ్యుటేషన్ లావాదేవీలు, ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధానం, పంట సాగు హక్కు కార్డు (సిసిఆర్‌సి ) కార్డులు వెంటనే జారీ చేయాలని స్పష్టం చేసారు. ప్రతీ శిబిరంలో మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కొత్త కార్డుల జారీ, ఆధార్ కార్డులలో సవరణల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఏ పి.ఓ వి.అభిషేక్, రంప చోడవరం పి ఓ సూరజ్ గనోరి, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్‌డిఓ పి. అంబేద్కర్, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డిఎల్‌పిఓ పి.ఎస్.కుమార్, డిఆర్‌డిఏ పీడీ వి.మురళి పాల్గొన్నారు.










