May 21,2023 20:29

బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు, అధికారులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌తో ప్రతి మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్‌ హాలులో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించి, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆధునిక వసతులతో జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మధ్యతరగతి ప్రజలు ఎలాంటి మోసాలకూ గురికాకుండా వారికి సొంత ఆస్తిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఎంఐజి లేఅవుట్‌ పేరుతో జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కుడా ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల పరిధిలో స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ను బనవాసి వద్ద 110 ఎకరాల్లో దాదాపు 1106 ప్లాట్లను ప్రభుత్వ లేఅవుట్‌ అప్రూవల్‌తో సిద్ధం చేశామని చెప్పారు. స్థలాలను కొనే వారికి, ఉద్యోగులకు, పింఛనర్లకు కుడా రిబేట్‌ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఒకేసారి డబ్బులు చెల్లిస్తే ఎంతో లబ్ధి చేకూరుతుందని, స్థలానికి సంబంధించిన మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లిస్తే సంపూర్ణ హక్కుతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి అందిస్తామని వివరించారు. కుడా వైస్‌ ఛైర్మన్‌ ఎ.భార్గవ్‌ తేజ్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, వైసిపి మండల కన్వీనర్‌ బిఆర్‌.బసిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌.రఘు, తహశీల్దార్‌ జయన్న, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపల్‌ కమిషనర్లు ఎన్‌.గంగిరెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, ప్లానింగ్‌ ఆఫీసర్‌ విజయభాస్కర్‌ పాల్గొన్నారు.