May 12,2023 23:56

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి తదితరులు

ప్రజాశక్తి - అనకాపల్లి
జిల్లాలోని అచ్యుతాపురం మండలం చోడపల్లి, భోగాపురం గ్రామాల్లో 16.50 లక్షలు, రూ.22 లక్షలు, రూ.26.40 లక్షలు ఖరీదులో 3రకాల 183 ఎంఐజి ప్లాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి వెల్లడించారు. కలెక్టరేట్లో శుక్రవారం ప్లాట్ల అమ్మకాలు, వెబ్‌ సైట్‌ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య ఆదాయ వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా అచ్యుతాపురం పిసిపిఐఆర్‌లో విఎంఆర్‌డిఎ ఈ ప్లాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం అనకాపల్లికి 16, విశాఖకు 36 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందన్నారు. మధ్య ఆదాయ తరగతుల వారికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజి ప్లాట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రజలు ఉద్యోగ వ్యాపార రంగాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికెపిసిపిఐఆర్‌ చైర్‌పర్సన్‌ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, విఎంఆర్‌డిఎ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, నోడల్‌ అధికారి శిల్ప, డిప్యూటీ డైరెక్టర్‌ బి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.