Mar 14,2023 21:21

ముందుకు సాగని చింతలపూడి, తాడిపూడి ప్రాజెక్టు పనులు
పడకేసిన డెల్టా ఆధునికీకరణ
ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌ పనులూ అంతే
కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం ప్రకటనలకే పరిమితం
పోలవరం నిర్వాసితుల హామీలకు నిధులిచ్చేనా?
దగ్గులూరు మెడికల్‌ కాలేజీ కాగితాల్లోనే
16న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఈ నెల 16న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న 2023-24 బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ సరిపడా నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వంటి పరిస్థితి కొనసాగింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులు చింతలపూడి, తాడిపూడితోపాటు డెల్టా ఆధునికీకరణ పనులు, ఆక్వా యూనివర్సిటీ, ఫిహార్భర్‌, పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇలా ఏ ఒక్కటీ ఇప్పటికీ నెరవేరలేదు. వైసిపి ప్రభుత్వం తన పాలనా కాలంలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. ఈసారైనా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా అనే చర్చ జిల్లావాసుల్లో సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలోని అత్యంత ముఖ్యమైనవిగా చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయితే 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పిల్ల కాలువల తవ్వకాలు జరిగితే 2.60 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. అయితే ఈ ప్రాజెక్టులు దశాబ్దాలు గడిచినా పూర్తికాని పరిస్థితి నెలకొంది. దీంతో అంచనా విలువ పెరిగిపోతుండటంతో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేనా అనే అనుమానం జిల్లావాసుల్లో నెలకొంది. 2008లో చింతలపూడి పాజెక్టును రూ.1,701 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కృష్ణా జిల్లాకు విస్తరించింది. మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.4,909.80 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనాలు రూపొందించారు. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. 2022-23కు సంబంధించిన బిల్లులు ఇంకా రూ.149 కోట్లు వరకూ పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన బడ్జెట్‌లో రూ.221 కోట్లు కేటాయించినట్లు చూపినా ఖర్చు చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఖర్చు అంచనా వ్యయం రూ.9,800 కోట్లుకు చేరింది. ఈ ప్రాజెక్టు పనులు 62 శాతం పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు రూ.నాలుగు వేల కోట్లు వరకూ ఖర్చు పెట్టారు. ఈ ఏడాది మెయిన్‌ కెనాల్‌ కాలువ పనులు 106 కిలోమీటర్ల మేర పూర్తి కావాలంటే రూ.1500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లోనైనా చింతలపూడికి నిధులు కేటాయిస్తారా అనే చర్చ రైతుల్లో సాగుతోంది. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి 2004లో అంకురార్పరణ జరిగింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీరందిస్తే 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.88.53 కోట్లు. ఇప్పటి వరకూ దాదాపు రూ.600 కోట్లు వరకూ ఖర్చు చేశారు. పిల్ల కాలువ తవ్వకం పూర్తయితే సాగునీరు పూర్తిస్థాయిలో అందుతుంది. గత బడ్జెట్‌లో రూ.పది కోట్లు కేటాయించినట్లు చూపారు. ఈ బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కొవ్వాడ, ఎర్రకాలువ రిజర్వాయర్‌, తమ్మిలేరు రిజర్వాయర్‌ పనులకు సంబంధించి సైతం నిధుల కేటాయింపు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిస్థితి తయారైంది. గత బడ్జెట్‌లో ఈ పనులన్నింటికీ గంపగుత్తగా రూ.68 కోట్లు కేటాయించినట్లు మాత్రం ప్రకటించి మమ అన్పించారు.
పడకేసిన డెల్టా ఆధునికీకరణ పనులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో, రబీలో కలిపి పది లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. ఎక్కడికక్కడే కాలువలు మెరకదేరిపోవడంతోపాటు లాకుల కట్టడాలన్నీ బ్రిటీష్‌ కాలంలో నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. చిన్నపాటి వర్షాలకు సైతం రైతులు పెద్దఎత్తున పంట నష్టపోతున్నారు. 2007లో జిల్లాలో డెల్టా ఆధునికీకరణ నిమిత్తం రూ.1416 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ దాదాపు రూ.800 కోట్లు పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.600 కోట్ల పనుల వరకూ జరగాల్సి ఉంది. గడిచిన మూడేళ్లుగా ఆధునికీకరణ పనులకు సంబంధించి అధికారులు ప్రణాళికలు పంపించడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆమోదం మాత్రం రావడం లేదు. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకూ ఆధునికీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం జరగలేదు. గత బడ్జెట్‌లో కేవలం రూ.పది కోట్లు కేటాయించినట్లు చూపారు. ఈ ఏడాదైనా బడ్జెట్‌లో ఆధునికీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాలి.
ముందుకు సాగని ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా యూనివర్శిటీ, కొల్లేరు రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు
నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్‌, వేములదీవిలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీటి నిర్మాణాలకు రూ.300 చొప్పున కేటాయించనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ పనులు పెద్దగా ముందుకు సాగిన పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంతో జిల్లా ప్రజానీకంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సముద్రపు నీరు కొల్లేరులోకి ప్రవేశించకుండా ఉప్పుటేరుపై దుంపగడప, పడితడక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకు రూ.412 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పనులు ప్రారంభం కాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా రెగ్యులేటర్ల నిర్మాణం ప్రస్తావన ఉంటుందో.. లేదోననే అనుమానాలు నెలకొన్నాయి.
కాగితాల్లోనే దగ్గులూరులో మెడికల్‌ కాలేజీ
పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు 2019లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జిల్లాల విభజన కూడా పూర్తయ్యింది. ఏలూరు మెడికల్‌ కాలేజీ పనులు కొంతమేర సాగుతుండగా, విభజిత జిల్లా పశ్చిమగోదావరిలోని పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో ప్రకటించిన మెడికల్‌ కాలేజీ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. దగ్గులూరు మెడికల్‌ కాలేజీ కోసం సేకరించిన 60 ఎకరాల భూమికి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సొమ్ము ఇవ్వని దుస్థితి నెలకొంది. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారో.. లేదో వేచిచూడాలి.
నిర్వాసితులకిచ్చిన హామీల అమలుకు నిధులొచ్చేనా?
పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కింద రూ.పది లక్షలు, 2006కు ముందు సేకరించిన భూములకు ఎకరాకు రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తామని గత ఎన్నికల్లో వైసిపి ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏఒక్క హామీ నెరవేర్చలేదు. నిర్వాసితులకిచ్చిన హామీలు గుర్తున్నాయంటూ చెప్పడం మినహా కార్యాచరణకు నోచని పరిస్థితి ఉంది. 2022 జులై, ఆగస్టుల్లో విరుచుకుపడిన గోదావరి వరదలకు పోలవరం నిర్వాసితులు గ్రామాలను వదిలి నెలలు తరబడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 41.15 కాంటూరు వరకూ ఉన్న గ్రామాలకు ప్యాకేజీ పూర్తిస్థాయిలో చెల్లించి ఖాళీ చేయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి ఉంది. దీంతో పోలవరం ముంపుబారిన పడుతున్న 22,404 కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అనేది లేకుండాపోయిన సంగతి తెలిసిందే.