
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ సిఎం కొట్టు
తాడేపల్లిగూడెం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నదాతకు అగ్ర పీఠం వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో జరిగిన సభలో నూతన పాలకవర్గం చేత మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఛైౖర్మన్‌గా ముప్పిడి సంపత్ కుమార్, వైస్ ఛైర్మన్‌గా చోడగిరి సత్యనారాయణ (చినబాబు), డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ నాడు వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు నేడు వ్యవసాయ రంగం గురించి, రైతు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని అపహాస్యం చేశారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ఇంతవరకు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే 67,312 మంది రైతులకు 210 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చి అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుందన్నారు. పవన్ కళ్యాణ్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. యూత్ లీడర్ కొట్టు విశాల్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కరరావు, వన్ టౌన్ సచివాలయాల కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ కైగాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.