ప్రజాశకిత - లింగపాలెం
కల్తీ లేని స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందించడమే జగనన్న పాల వెల్లువ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా పాల సేకరణ ప్రారంభంపై అధికారులతో, పాడి రైతులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలు తాగే పాలను సైతం కల్తీ చేయడం అమానుషమని, లింగపాలెం మండలంలో ఇటీవల కల్తీ పాల వ్యవహారం బయటపడిందని, అలాంటి ఘటనలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, జిల్లాలో మరెక్కడా కల్తీ పాలు జరగకుండా గట్టి నిఘా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పాడి రైతులకు మేలుచేస్తుందని, పాలు అందించే పాడి రైతులకు మెరుగైన ధర అందించి, ప్రయివేటు పాల డైరీల దోపిడీ నుండి పాడి రైతులను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణలో వెన్న శాతం, పరిమాణాల కొలత ఖచ్చితత్వంతో ఉంటుందన్నారు. పాలు అందించిన పది రోజుల్లో సంబంధిత పాడి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారన్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 14 వేల లీటర్లకు పైగా పాల సేకరణ జరుగుతుందని, దీనిని 20 వేల లీటర్లకు తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలంలోని తిమ్మక్కపాలెం, మల్లేశ్వరం, లింగపాలెం-2, కల్యాణంపాడు గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ కేంద్రాల ఏర్పాటుపై నెలకొన్న సమస్యలను కలెక్టర్ అధికారులు, ప్రజాప్రనిధులు, మహిళా పాడిరైతులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. పాలను అందించే మహిళా పాడి రైతులతో పాడి రైతు సంఘంను ఏర్పాటు చేసి, పాల సేకరణ లాభాలను వారే పొందొచ్చన్నారు. పాల సేకరణ పెరిగే కొద్దీ సంఘాలకు లాభాలు పెరుగుతాయన్నారు. జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ అమూల్ సంస్థ ప్రయివేటు సంస్థ కాదని, పాడి రైతులందరూ సభ్యులుగా కలిగిన సహకార విధానం ద్వారా ఏర్పాటైన వ్యవస్థ అని అన్నారు. జగనన్న పాల వెల్లువలో పాలల్లో వెన్న శాతం బట్టి 11 శాతం వెన్న కలిగిన పాలకు రూ.82కు పైగా ధర లభిస్తుంటే, ప్రయివేటు డైరీల వారు కేవలం అత్యధికంగా రూ.72 మాత్రమే అందిస్తున్నారన్నారు. అమూల్ సంస్థ వారు పాడిరైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, పెట్టుబడి రుణాలు, ఆరు నెలల పాటు నిరంతరాయంగా సేకరణ కేంద్రాలకు పాలు అందిస్తే పశువుల కొనుగోలుకు రుణాలు అందించడంతోపాటు, వారి పశువులకు అవసరమైన నాణ్యమైన దాణా అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 20 రూట్లలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా పాల సేకరణ జరుగుతుందన్నారు. లింగపాలెం మండలంలో ఈ నెల ఆరో తేదీ నుండి పాల సేకరణ ప్రారంభవుతుందన్నారు. జిల్లా సహకార అధికారి ప్రవీణ మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో 374 మంది పాడిరైతులతో ప్రారంభమై ప్రస్తుతం 10,348 మంది రైతుల నుండి పాల సేకరణ స్థాయికి చేరుకుందన్నారు. ప్రస్తుతం రోజుకు 14 వేల లీటర్లకు పైగా పాలను సేకరిస్తున్నామని, జిల్లాలో ఇంతవరకు 47 లక్షల లీటర్ల పైగా పాలను సేకరించామని, నవంబర్‌లో నాలుగు లక్షల లీటర్ల వరకు పాలను సేకరించామని తెలిపారు. పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమచేశామన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్ర, జెడ్‌పిటిసి సభ్యులు హరినాధరాజు, తహశీల్దార్ మురళీకృష్ణ, ఎంపిడిఒ ఆశీర్వాదం, ముసునూరు వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, జగనన్న పాల వెల్లువ పథకం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










