Oct 17,2023 22:36

ప్రజాశక్తి- చిత్తూరు: జగనన్న పాలవెల్లువ రెండవ విడతకు సంబంధించి పాడి రైతులను ఇంటింటా సర్వేని పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పశుసంవర్ధక శాఖ సమావేశం హాల్‌లో డిసిఓ.బ్రహ్మానంద రెడ్డి, పశు సంవర్ధక శాఖ జెడి ప్రభాకర్‌, డెయిరీ డెవలప్మెంట్‌ అధికారి రవిచంద్రన్‌ డిసిసిబి సీఈఓ మనోహర్‌ గౌడ్‌లతో కలిసి జిల్లాలో రెండో విడతలో జగనన్న పాల వెల్లువ సేకరణకు సంబంధించి సమావేశమయ్యారు. ఈసందర్భంగా 11 మండలాలలో పరిధిలో జగనన్న పాలవెల్లువ ద్వారా పాలు సేకరణకు పాడి రైతుల ఇంటింటికి వెళ్లి సర్వేపై రూట్‌ ఇన్‌ చార్జెస్‌లు, మెంటార్స్‌, అసిస్టెంట్‌ మెంటార్స్‌, అమూల్‌ డెయిరీ, డ్వామా ఏపిఎంలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ కల్లా జగనన్న పాల వెల్లువకు సంబంధించి జిల్లాలో రెండో విడతలో 11 మండలాల్లో 107 రైతు భరోసా కేందం పరిధిలోని గ్రామాలలోని పాడి రైతుల ఇంటింటికి వెళ్లి సర్వేని పూర్తిచేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయ్యిన తర్వాత గ్రామాలలో పాడి రైతులతో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబరు 1 నుండి పాలసేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమ మొదటివిడతలో పైలట్‌ ప్రాజెక్టు కింద వి.కోట, శాంతిపురం, రామకుప్పం మండలాలలోని 101 గ్రామాలలో ఇప్పటికే పాలసేకరణ జరుగుతుందని తెలిపారు. సర్వేకి సంబంధించి సమస్యలుంటే మొదటి విడతలో పనిచేసిన మోంటర్స్‌, రూట్‌ ఆఫీసర్స్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో అమూల్‌ డెయిరీ మేనేజర్‌ నవీన్‌, ఏపిఎంలు, రూట్‌ ఇన్‌ఛార్జులు, మెంటార్స్‌, అసిస్టెంట్‌ మెంటార్స్‌, అమూల్‌ డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.