Nov 10,2022 23:50

సమస్యలపై ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ సభ్యులు

ప్రజాశక్తి -నక్కపల్లి:c. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను హౌసింగ్‌ డిఇ విజేయుడు, ఏఈ రామకృష్ణలు వెల్లడిస్తుండగా సభ్యులు అడ్డు తగిలారు. జగనన్న లే అవుట్‌లకు సంబంధించిన సమస్యలపై అధికారులపై విరుచుకుపడ్డారు. ఎంపీటీసీ సభ్యులు ఆకేటి గోవిందరావు, కుంచె మధు, మెరిగి నాగేశ్వరరావు, సర్పంచ్‌లు మైలుపల్లి శ్రీనివాసరావు, పొడగట్ల వెంకటేశ్వరరావు, రెడ్డి వరహాలు తదితరులు జగనన్న లేఅవుట్‌లలో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. ఎంపీటీసీ కుంచే మధు మాట్లాడుతూ, జంతువులు నివసించే స్థావరాల్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. పెదతీనార్ల పంచాయతీ సర్పంచ్‌ మైలపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు మేరిగి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సుమారుగా 38 మంది అనర్హులకు ఇళ్ల స్థలాలను కేటాయించారని, గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు ఇళ్ల స్థలాలను కేటాయిం చాలని డిమాండ్‌ చేశారు. ఉద్దండపురం సర్పంచ్‌ పొడగట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 42 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండానే, లబ్ధిదారుల జాబితాలో ఎలా ప్రకటించారని అధికారులను ప్రశ్నించారు. ఆకేటి గోవిందరావు, రెడ్డి వరహాలు మాట్లాడుతూ, అక్రమంగా విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వు కుంటున్నా అధికారులు పట్టించుకోలేదని, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు గ్రావెల్‌ తవ్వకాల కోసం అనుమతులు కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టించి ఇస్తే సీజ్‌ చేయకుండా ఎలా వదిలేసారని ఎంపీటీసీ సభ్యులు ఆకేటి గోవిందరావు డిటి నీరజను ప్రశ్నించారు. పోలీసులకు వాహనాలను అప్పగించడం జరిగిందని ఆమె బదులిచ్చారు. నక్కపల్లి ఆర్టిసి కాంప్లెక్స్‌లోకి బస్సులు ఎందుకు రాలేదని నర్సీపట్నం ఆర్టిసి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రకాష్‌ ను అడగ్గా తనకు తెలియదని అనకాపల్లి ఆర్టీసీకి సంబంధించిన విషయమని బదులిచ్చారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని శివారు గ్రామాల్లో కూడా నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. సర్వసభ్య సమావేశానికి అధికారులందరూ పూర్తిస్థాయి సమాచారంతో హాజరయ్యే విధంగా చూడాలన్నారు. నివాసాలకు అనుకూలంగా లేని లే అవుట్‌ల సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిం చాలని కోరారు. మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు లోడగల చందర్రావు మాట్లాడుతూ, గృహ నిర్మాణాల విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, ఎంపీడీవో సీతారామరాజు, ఉపాధ్యక్షులు వీసం నానాజీ మాట్లాడుతూ, సభ్యులు లేవ నెత్తిన సమస్యలపై వారంలో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. లే అవుట్‌ల సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. పలువురు సభ్యులు ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. డిఎల్‌ పురం ఎంపీటీసీ సభ్యులు కొండ్ర కనకారావు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ఎంపీడీవో సీతారామరాజు మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులకు నాలుగు లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీంతో గ్రామం లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ , జెడ్‌ పిటిసి సభ్యురాలు గోసల కాసులమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వెలగా ఈశ్వరరావు, పలువురు సర్పంచ్‌ లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.