ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న లేఅవుట్ -5 లో గహ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పట్టణంలోని గుమడాం లేఅవుట్ -5లో సుమారు 20ఎకరాల స్థలంలో ప్రభుత్వం 1440మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, 2020లో అప్పటి ఎమ్మెల్యే రాజన్నదొర పేదలకు ఇళ్ల స్థలాలను అందజేశారు.ప్రస్తుతం నిర్మాణంలో టిడ్కో గహాల సముదాయం వెనుక ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. గుమడాం రెవిన్యూ పరిధిలో శివరాంపురం సమీపంలో ఉన్న ఈ లేఅవుట్ భూమిని ఎకరా రూ.20లక్షలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లేఅవుట్‌లో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా,విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అధికారులు ఎంత నచ్చజెప్పినా ఇళ్ల నిర్మాణంపై లబ్దిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంతవరకు 200మంది లోపే పునాదులు, ఆరడుగుల గోడల వరకు నిర్మించి వదిలేశారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి ఇంటి నిర్మాణం ప్రారంభించాలని ఒత్తిడి చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది తాము కట్టలేమని పట్టాలను అధికారులకు తిరిగి ఇచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒతో పాటు అధికారులు అనేక సార్లు స్థానిక హౌసింగ్ అధికారుల, సచివాలయం సిబ్బందిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. సాక్షాత్తూ అప్పటి హౌసింగ్ మంత్రి శ్రీరంగనాధరాజు కూడా లేఅవుట్‌ను పరిశీలించి లబ్దిదారులకు అవగాహన కల్పించారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర కూడా లేఅవుట్ ని పరిశీలించి లబ్దిదారులతో ఇళ్లు కట్టించేలా చూడాలని సచివాలయ సిబ్బందికి నచ్చజెప్పారు. అయినా ఫలితం లేకపోయింది. మొత్తం లబ్దిదారుల్లో 20శాతం మంది మాత్రమే పునాదులు నిర్మించి వదిలివేశారు. అరకొరగా నిధులు, భూమి నాణ్యత లేకపోవడం వల్లే లబ్ధిదారులెవరూ నిర్మాణాలకు ముందుకు రానట్టు తెలుస్తోంది
భూమి నాణ్యత పై అనుమానం
గుమడాం లేఅవుట్ -5 కోసం సేకరించిన భూమి గహ నిర్మాణానికి అనువైనది కాదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పునాది నిర్మాణానికే లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని కొంతమంది లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గహ నిర్మాణం కోసం లక్షా 80వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తోంది. యూనిట్ విలువలో 80శాతం సొమ్ము పునాదికే సరిపోతే ఇంటిని ఎలా నిర్మించగలమని వాపోతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారుల్లో చాలా మంది సొంత ఇల్లు వున్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణానికి అనువైన భూమి కాకపోవడం వల్లనే లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి మొహం చాటేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రియల్ వ్యాపారుల కన్ను
గుమడాం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి లేని లబ్దిదారులు తమ స్థలాలను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ లేఅవుట్ లో కొంతమంది లబ్దిదారులు స్థలాలను విక్రయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణానికి చెందిన కొంతమంది కౌన్సిలర్లు కూడా స్థలాల అమ్మకాల్లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చౌకగా వస్తున్నందున రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది పునాదులు నిర్మించి, మరి కొందరు స్థలాలను అమ్మకానికి పెడుతున్నట్లు తెలుస్తోంది.










