Nov 17,2023 20:02

లే అవుట్‌ను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు :  మండలంలోని కొండికందుకూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన జగనన్న అర్బన్‌ లే అవుట్‌ను టిడిపి నేతలు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కందుకూరు పట్టణంలో నివసించే పేదలకు, పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలోని కొండి కందుకూరు వద్ద మూడేళ్ల కిందట వైసిపి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ లేఅవుట్‌ ను నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం, ఇతర నాయకులు పరిశీలించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నేలపైనే బేస్మెంట్లు వేసి, నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. లేఅవుట్లో మూడు వంతులు నిర్మాణాలు మొదలు కాకపోగా, ఆ ప్రాంతమంతా చిల్ల చెట్లు మొలిచి చిట్టడవిని తలపిస్తోందని మీడియా ముందు మాట్లాడారు. కేవలం అధికార పార్టీ నేతల జేబులు నింపటానికి మాత్రమే పట్టడానికి దూరంగా లేఅవుట్‌ ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని నాగేశ్వరరావు ఆరోపించారు. ఆ ప్రాంతంలో అప్పట్లో ఎకరం ధర 8లక్షల లోపే ఉండగా, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో 13.5 లక్షల చొప్పున 13 ఎకరాలు కొనుగోలు చేశారని నాగేశ్వరరావు తెలిపారు. ఈ వ్యవహారంలోనే కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు తెలుస్తోందని ఆరోపించారు. దివి శివరాం మాట్లాడుతూ రెండు సెంట్ల స్థలంలో నిర్మించే ఇంట్లో ఎలా నివసిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, లేటెస్ట్‌ టెక్నాలజీ తో జి ప్లస్‌ త్రీ ఇళ్లు కట్టిస్తే... జగనన్న కట్టిస్తున్న అగ్గిపెట్టె ఇళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.