Oct 29,2023 23:36

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జగనన్న లే-అవుట్లు, టిడ్కో హౌసింగ్‌లో సౌకర్యాలు కల్పించాలని హౌసింగ్‌, టిడ్కో ఇంజినీరింగ్‌ అధికారులను కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులు, ఎమినిటీస్‌ సెక్రటరీలతో టిడ్కో, జగనన్న లే-అవుట్లలో నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వడ్డెర కాలనీ, మోరంపూడి బ్లాక్‌-2, సింహాచలనగర్‌, బొమ్మూరు-2, నామవరంలోని ఇళ్ల సముదాయాల్లో రోడ్లు, కాలువలు, ఎలక్ట్రికల్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. వెలుగుబంద, కానవరం జగనన్న లే-అవుట్లలో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్‌, ఎమినిటీస్‌ సెక్రటరీలకు లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. లక్ష్యాన్ని చేరుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అందరూ అంకిత భావంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పిఎం.సత్యవేణి, టిడ్కో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరావు, టిడ్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సిఎంఎం, హౌసింగ్‌ డిప్యూటీ ఇంజినీర్‌, హౌసింగ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, ఎమినిటీ సక్రటరీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.