Oct 30,2022 23:08

పోటీల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో నవంబర్‌ నెలలో జగనన్న క్రీడా సంబరాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత క్రీడా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం రాత్రి జగనన్న క్రీడా సంబరాల పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ క్రీడా సంబరాలలో భాగంగా నిర్వహించే పోటీలను గురించి అల్లూరి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహనరావు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు చేపడుతున్న వాలీబాల్‌, బాల్‌ బ్యాట్మెంటన్‌ క్రీడల్లో పురుషులకు, మహిళలకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషులకు మాత్రమే క్రికెట్‌ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందే క్రీడాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు 17 సంవత్సరముల పైబడిన వారికి మాత్రమే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి సూరిబాబు, కోఆర్డినేటర్‌ సింహాచలం పాల్గొన్నారు.