ప్రజాశక్తి- కొత్తకోట:రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు నివాస గృహాలు కల్పిస్తే తెలుగుదేశం, జనసేన నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రావికమతం మండలం కొత్తకోటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేని జగనన్న కాలనీ పథకాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు రాజకీయ లబ్ది కోసం నీరు కార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ప్రతి పేదవానికి కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ కృషి చేస్తున్నారని ధర్మశ్రీ చెప్పారు. తెలుగుదేశం పార్టీ పేదలకు నివాస స్థలాలు పంపిణీ చేయొద్దు అంటూ కోర్టులను ఆశ్రయించిందని ఇప్పుడు జనసేన పార్టీ సైనికులు జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందంటూ కాలనీ నిర్మాణాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అవినీతి జరిగిన చోట నిరూపిస్తే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుందని ధర్మశ్రీ పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇష్ట ప్రకారమే కాలనీల నిర్మాణాలు చేపడుతున్నామని అందులో అవినీతికి తావు లేదని స్పష్టం చేశారు. ఇల్లు నిర్మాణంలో నాణ్యత లోపం, అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారని, పారదర్శకంగా పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. జగనన్న కాలనీ నిర్మాణాల జాప్యానికి కారణాలు కరోనా, వర్షాలు, కొంత కాగా టిడిపి కోర్టుల ద్వారా పెట్టిన అడ్డంకులు వల్లే కాలనీ ఇల్లు నిర్మాణాలు జరగలేదని ధర్మశ్రీ చెప్పారు. కొత్తకోటలో తాగునీటి అవసరాలకు సుమారు రూ.20 కోట్ల నిధులతో ప్రణాళిక రూపొందిస్తున్నామని, బుచ్చయ్యపేట మండలంలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను నివారిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, ఉప సర్పంచ్ పందల దేవ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి ఆదిమూర్తి, ఎంపీటీసీలు పూడి దేవ, కుంచా లక్ష్మీ, పైల చిన్నమ్మలు, శీలం శంకర్రావు, గుమ్మడి దొరబాబు, మాజీ ఉపసర్పంచ్ కె.గున్నాజీ, గాలి రమణబాబు పాల్గొన్నారు.










