ప్రజాశక్తి-ఏలేశ్వరం ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న జగనన్న కాలనీలు కనీసం గృహ నిర్మాణాలు జరగని పరిస్థితి ఏలేశ్వరంలో ఏర్పడింది. ఏలేశ్వరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఇచ్చిన పైపులైన్ జగనన్న కాలనీలో గహ నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంటి అద్దెలు చెల్లించలేక అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న వారికి నివాసాలకు కనీస వసతులు లేవు. గృహ నిర్మాణాలకు సిమెంట్, ఇసుక ఇటుక వంటి సామగ్రి తీసుకెళ్లడానికి కనీస రహదారి లేకపోవడంతో లింగంపర్తి మీద నుండి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక సిమెంట్ బస్తా అయినా 10 సిమెంట్ బస్తాలైన ఆటోకు రూ.300 చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రుణం ఎలాగూ సరిపోదు కనీసం అప్పులు చేసి నిర్మించుకుందాం అన్న రెండు రెట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. జగనన్న కాలనీలో వసతులు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఊదరగొడుతున్న ఏలేశ్వరంలో అందుకు భిన్నంగా ఉంది. పైపులైన్ అవతల నుంచి మూడు కిలోమీటర్ల లోపల ఇచ్చిన జగనన్న స్థలాల్లోకి వెళ్లాలంటే పెద్ద పంట కాలవ దాటి వెళ్లాల్సి వస్తోంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థలాలు ఏదో ఇచ్చామన్న పేరుకే ఇచ్చారు కానీ కనీసం రహదారులు లేవని, కాలనీలో దారులు అటు నుంచి కాలనీకి వెళ్లే దారి చూపిం చండి మహా ప్రభో అని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇల్లు నిర్మించుకున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పప్పుకైనా ఉప్పుకైనా ఊర్లోకి రావాలంటే పంట పొలాల మధ్య నుంచి మట్టిబాటపై కాలువలు దాటుకుని రావాల్సి వస్తోంది. కనీసం మాత్ర కొనుక్కోవాలి అన్నా ఏలేశ్వరం రాలేని దుస్థితిలో జీవిస్తున్నామని వారు అంటున్నారు. ఇల్లు నిర్మించు కోకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని వాలంటీర్లు చెప్పడంతో అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నామని, ఇటు కాలనీలో నివసించలేక అటు ఊర్లో అద్దెలు కట్టుకోలేక ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం లింగంపర్తి నుంచి అయినా తిరిగి వద్దామంటే ఆ రహదారి సైతం ఇటీవల వర్షాలకు శిథిలావ్యవస్థకు చేరుకుందని వారు అంటున్నారు. ఈ విషయమై జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఎన్ని ఫోన్లు చేసిన పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పైప్ లైన్ జగనన్న కాలనీకి ప్రధాన రహదారి నిర్మించి ఇళ్ళ నిర్మాణాలు త్వరితగతిన సాగేలా చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.










