ప్రజాశక్తి-బాపట్ల: జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శనివారం బాపట్ల పాడిసన్ పేట జగనన్న లేఔట్‌లో నీటి కోసం వేస్తున్న బోరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భానుప్రతాప్ మాట్లాడుతూ మార్చి నెలాఖరుకల్లా లేఔట్లలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గృహ నిర్మాణాలకు నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన బోర్లు వేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో మూలపాలెం జగనన్న కాలనీ లేఔట్‌కు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా పాడిసన్ పేట, బేతనీ కాలనీ జగనన్న లేఔట్లలో రహదారుల నిర్మాణం, విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సిమెంటు, ఇసుక గృహోపకరణాలకు సంబంధించి త్వరితగతిన లబ్ధిదారులకు అందే విధంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో ప్రభుత్వం అందించే సామగ్రి పంపిణీ జరుగుతుందని అన్నారు. లేఔట్లు పరిశీలన కార్యక్రమంలో మునిసిపల్ ఏఈ శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ డిఈ కె శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, ఏఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.










