* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి- జలుమూరు: జగనన్న ఇళ్ల కాలనీలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. మండలంలోని చల్లవానిపేటలోని చల్లవానిపేట, లింగాలవలస జగనన్న కాలనీలను గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ముఖద్వారం, బిటి రోడ్డు, గ్రావెల్ రోడ్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. కాలనీలో అవసరమైన చోట్ల సిసి రోడ్లు నిర్మించేందుకు ఎస్టిమేషన్ వేసి పంపిస్తే నిధులను మంజూరు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడారు. జగనన్న ఇళ్ల కాలనీకి ముందు ఖాళీగా ఉన్న స్థలాన్ని చూసి ఆ స్థలం పొజిషన్‌పై తహశీల్దార్ బి.సత్యంను అడిగి తెలుసుకున్నారు. ఇది డీపట్టా భూమేనని చెప్పారు. అయితే కాలనీలోని పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఈ స్థలాన్ని ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎంపిపి వాన గోపి, పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు దామ మన్మథరావు, హౌసింగ్ పీడీ నక్క గణపతిరావు, ఎంపిడిఒ ఎల్.వి.అప్పారావు, హౌసింగ్ డిఇలు డి.రామ్మూర్తి, కె.అప్పారావు, ఇఒపిఆర్‌డి పి.ఉమామహేశ్వరరావు, మండల ఇంజినీర్ కె.శ్రీధర్, మండల సర్వేయర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, మండల సలహాదారుడు పైడి విఠల్‌రావు, చిన్నాల మురళి, పొన్నాన విజరు కుమార్, కరుకోల హరిప్రసాద్ పాల్గొన్నారు.










