ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నాశిరకపు నిర్మాణాల వలన జగనన్న కాలనీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, వాటి వలన ప్రజలకు ఇక్కట్లేనని రాజంపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. శనివారం పులపుత్తూరులోని జగనన్న కాలనీల స్థితిగతులపై సందర్శించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు నాణ్యమైన ఆవాసాలు నిర్మించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్లు బాధితులు తమ దష్టికి తీసుకోచ్చారన్నారు. గోడ కంటే కొంచెం ముందుకు స్లాబ్ వేయడం వలన గోడలో చెమ్మ దిగదని, కానీ బడ్జెట్ ఎక్కువవుతుందన్న కారణంగా కాంట్రాక్టర్ ఆ పద్ధతిన నిర్మించడం లేదని లబ్దిదారులు విలపిస్తున్నారని తెలిపారు. సమస్యను ఉన్నత ఉన్నత అధికారులు దష్టికి తీసుకోవడమే కాకుండా తమ అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలియజేసి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు సుబ్బరాయుడు, నాయకులు భాస్కర్ పంతులు, పోలిశెట్టి రజిత పాల్గొన్నారు. నందలూరు: మండలంలోని లేబాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఆడపూరు పంచాయతీలో పలు గ్రామాలలో మలిశెట్టి వెంకటరమణ 104వ రోజు పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో లేబాక జనసేన పార్టీ నాయకులు మహేష్, వినరు, పవన్, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.










