Aug 08,2023 21:13

జగనన్న కాలనీలో వసతులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి గోరంట్లరూరల్‌ : జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం గోరంట్ల మండలంలోని గుమ్మయగారిపల్లి వద్ద గల మల్లాపల్లి జగనన్న కాలనీ లో ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. నెలాఖరులోపు రోడ్లు, డ్రైనేజీలతోపాటు నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను సూచించారు. అలాగే మల్లాపల్లి గ్రామ సచివాలయ భవనం వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ ల నిర్మాణాలు వారంలోపు పూర్తి చేయాలని, వెంటనే వాడుకులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఈఈ చంద్రమౌళి, తహశీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీవో రఘునాథ్‌ గుప్తా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌, రైతు విభాగం అధ్యక్షులు పాటూరి శంకర్‌ రెడ్డి, జెడ్పీటీసీ పాలే జయరామ్‌ నాయక్‌, ఎంపీపీ ప్రమీల మూర్తి, వైస్‌ ఎంపీపీ నాగభూషణ్‌ రెడ్డి, సర్పంచ్‌ శివానంద, జడ్పీ కో ఆప్షన్‌ డాక్టర్‌ భాషా, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
సోమందేపల్లి : సచివాలయ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. మండల పరిధిలోని గుడిపల్లి, తుంగోడు, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. గుడిపల్లి సచివాలయ పరిధిలో జరుగుతున్న సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాలను పరిశీలించారు, తొందరగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాడు. అనంతరం తుంగోడు గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా భవనాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. నూతన అడ్మిషన్లు, గతంలో ఉన్న అడ్మిషన్ల గురించి ప్రధాన ఉపాధ్యాయులు ఖాదరవలిని అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్లు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు, పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, తహశీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఈవోఆర్డీ నాగరాజురావ్‌, ఎంఇఒ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.