Apr 26,2023 00:52
బుడబుక్కల సామాజిక వర్గ ప్రజలతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-పంగులూరు: జగనన్న లేఅవుట్లలో పట్టాలు పొందిన లబ్ధిదారులందరూ, కాలనీ ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి, పంగులూరు మండల ప్రత్యేక అధికారి ప్రసాద్‌ కోరారు. మంగళవారం మండలంలోని బయట మంజులూ రు, కొండమూరు, రేణింగవరం, పంగులూరు, ముప్పవరం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లలో పీడీ ప్రసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులను కలిసి వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఉన్న ఇబ్బందులను అధికారులు వారిని అడిగి తెలుసు కున్నారు. జగనన్న కాలనీలలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. 1,80,000 రూపాయల రుణ సౌకర్యంతో పాటు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని, ఇవి కాక డిఆర్‌డిఏ ద్వారా 35 వేల రూపాయలు బ్యాంకు రుణం కూడా ఇప్పిస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అధికారులు కూడా లబ్ధిదారులకు ఉన్న సమస్యలను తెలుసుకొని, వారిని ఉత్సాహపరిచి ఇల్లు నిర్మించుకునేందుకు కృషి చేయాలని కోరారు.
జగనన్న కాలనీలోకి మేం వెళ్లం
- బుడబుక్కల సామాజికవర్గ మహిళలు
జగనన్న లేఅవుట్లో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి తాము వెళ్లమని, పంగులూరు గ్రామంలోని బుడబుక్కల సామాజికవర్గ మహిళలు అధికారులకు తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కన నివాసం ఉంటున్న బుడబుక్కల సామాజిక వర్గం ప్రజల దగ్గరకు, అధికారులు వెళ్లి ఇక్కడ స్థలాన్ని ఖాళీ చేసి జగనన్న కాలనీలో నిర్మించుకోవాలని కోరారు. అందుకు మహిళలు మాట్లాడుతూ, తాము ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లమని, అక్కడ మాకు వాస్తు బాగాలేదని, అక్కడ మా పందులకు గూళ్లు కడితే అక్కడ పందులు మొత్తం చనిపోయాయని, అందువలన తాము అక్కడకు వెళ్లమని అధికారులకు జవాబు చెప్పారు. ఆరోగ్య కేంద్రం పక్కన పందులు తిరగటం సరయింది కాదని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించాలని, ఏదో ఒకటి చేద్దామని గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాదు వారితో చెప్పి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణమూర్తి, తహశీల్దారు పద్మావతి, హౌసింగ్‌ ఏఈ కిషోర్‌ కుమార్‌, పంగులూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ మల్లికార్జునరావు, సర్పంచి గుడిపూడి నాగేంద్రమ్మ రామారావు, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకట సుబ్బారావు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ అనంతలక్ష్మి, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు.