ప్రజాశక్తి-నందిగామ: పట్టణ శివారు అనాసాగరంలో జగనన్న ఇళ్ల లేఅవుట్లను సిపిఎం బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ అనాసాగరంలో రెండు వాగుల మధ్యలో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చి వాగులు పొంగితే లేఓవుట్లలో వేసిన రోడ్లు, కరెంటు స్థంభాలు సైతం కొట్టుకుపోతాయని తెలిపారు. రోడ్లు వేసి మూడు నెలలు అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. ఇల్లు నిర్మించుకోవటానికి కనీసం ఆరు అడుగులు మేర పునాదులు తీసుకోవాలని, జగనన్న ఇచ్చే రూ.1.80 లక్షలు ఏమూలకు సరిపోతాయని ప్రశ్నించారు. ఇసుకు ట్రక్కు కిరాయి రూ.2 నుండి 4 వేల వరకు తీసుకుంటున్నారని, ఇళ్ల నిర్మాణాలకు పెరిగిన మెటిరియల్ ధరలకు సుమారు రూ.8 లక్షలు లేనిదే ఇల్లు పూర్తయ్యే పరిస్థితిలేదని చెప్పారు. జగనన్న ఇచ్చిన మొదటి ఆప్షన్ ప్రకారం రూపాయికే పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కటారపు గోపాల్, నాయకులు సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, వి.రవిశేఖర్, ఆకుల వెంకటనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










