ప్రజాశక్తి - మక్కువ : అన్ని రకాల మౌలిక వసతులతో జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆ సౌకర్యాల్లేలేని పరిస్థితి మండలంలోని మార్కొండపుట్టిలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని దళిత కాలనీకి కేటాయించిన జగనన్న కాలనీకి వెళ్లేందుకు దారేలేని పరిస్థితి నెలకొంది. సాక్ష్యాత్తూ డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర సొంత పంచాయతీలోని ఈ విధమైన నిర్మాణాలు జరగడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. వివరాల్లోకి వెళ్తే...
మండలంలోని మార్కొండపుట్టి పంచాయతీలో జగనన్న కాలనీకి రెండు లేఔట్ కేటాయించారు. ఇందులో 13 ఇళ్లకు గానూ ఎస్సీలకు కేటాయించారు. ఈ లేఔట్లకు సంబంధించి సరైన రహదారి లేకపోవడంతో గృహాలు కట్టేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిరాయితీ భూముల్లో నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు భూ యజమానులు అంగీకరించకపోవడంతో అర్ధాంతరంగానే కొన్ని ఇళ్లు నిలిచిపోయాయి. ఈ విషయమై పలుమార్లు తహశీల్దారు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీకి రహదారిని ఏర్పాటు చేయాలని దళితులు కోరుతున్నారు.
దళితులను వేరేగా కేటాయింపు ఎందుకు?
జగనన్న కాలనీలో ఇళ్ల కేటాయింపుల్లో అన్ని కులాలకు ఒకే చోట ఉండేలా కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికీ పంచాయతీ పరిధిలో ఈ నిబంధన పాటించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రహదారి అంతా బాగున్న ప్రాంతాన్ని బీసీల కేటాయించి, ఎలాంటి రహదారి సౌకర్యం లేని లేఅవుట్‌ను దళితులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రాంతాల మాదిరిగా ఇక్కడ ఎందుకు అందరికీ ఒకే చోట కేటాయింపులు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దారి ప్రస్తావన మా వద్దకు వచ్చింది
ఎస్సీలకు కేటాయించిన లేఔట్‌లో దారి లేదని పలువురు లబ్ధిదారులు మా దృష్టికి తెచ్చారు. రహదారి విషయమై కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ పూర్తిస్థాయి దారి కోసం స్థానిక సచివాలయ సిబ్బంది, రెవెన్యూ ఉద్యోగులతో కలిసి స్థల పరిశీలన జరిగేలా కృషి చేస్తాం.
సింహాచలం, హౌసింగ్ ఎఇ










