Sep 08,2023 19:39

ఎంపిడిఒకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
జగనన్న కాలనీకి వెళ్లాలంటే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, వంకపై బ్రిడ్జిలు నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎంపిడిఒ గీతావాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో సుమారు 97 మందికి పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం జరగాలంటే, వంక అడ్డంగా ఉందని తెలిపారు. వంకపై బ్రిడ్జిలు నిర్మించి ఇస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఈ రస్తా వెంట సుమారు 300 ఎకరాలకు సంబంధించిన 40 మంది రైతులు ఎరువులు, విత్తనాలు, పంట కోత సమయంలో దిగుబడులు తీసుకురావడానికి సమస్యగా ఉందని తెలిపారు. బ్రిడ్జిలు నిర్మించి జగనన్న కాలనీ లబ్ధిదారులకు, రైతుల సమస్య పరిష్కరించాలని కోరారు. కొండ పక్కన బసవేశ్వర దేవాలయం దగ్గర నిరుద్యోగ యువత ప్రిపరేషన్‌ కోసం వెళ్తుంటారని, వారికి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. ఈ సమస్యను గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే బ్రిడ్జిలు నిర్మించి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే విధంగా పాలకులు, అధికారులు సహకరించాలని కోరారు. లేకపోతే సిపిఎంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామకృష్ణ, నర్సప్ప, బంగారయ్య, హుస్సేని, తాయప్ప, నాగరాజు పాల్గొన్నారు.