ప్రజాశక్తి - కోసిగి రూరల్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా పేదలందరికీ ఇల్లు పథకం కింద అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడం చూసి, ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వాటిని శ్మశాన వాటికతో పోల్చడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి విమర్శించారు. సోమవారం వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్ రెడ్డి ఆధ్వరంలో నియోజకవర్గ పరిధిలోని కోసిగి నుంచి ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం వరకు దాదాపు 800 బైక్‌లతో కోసిగిలోని రంగప్ప గట్టు నుంచి వైఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా ఉరుకుంద వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయి ఆయనే స్వయంగా కోసిగి నుంచి ఉరుకుంద వరకు బైక్ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి పట్టాల గురించి పిచ్చి రాతలతో పచ్చ మీడియా ప్రచురణతో ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారి పార్టీలకు పుట్టగతులు ఉండవని తెలిపారు. మళ్లీ 2024లో జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










