
జగనన్న ఇళ్లల్లో పరిశీలన
ప్రజాశక్తి-కావలి : కావలిలో చిరుజల్లులకే కూలిపోతున్న జగనన్న ఇళ్లను బుధవారం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక బృందం పరిశీలించింది. ఈ బృందంలో వేదిక కన్వీనర్ కరవది భాస్కర్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ), జ్యోతి బాబురావు(టిడిపి), పసుపులేటి పెంచలయ్య (సిపిఎం), పొబ్బ సాయివిఠల్(జనసేన), బలిజేపల్లి వెంకటేశ్వర్లు(సిపిఐ), సునీలు, వేణు, గడే నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని చూసి బృందం షాక్‌కు గురైంది. కట్టిన ఇళ్లకు క్యూరింగ్ లేకపోవడం, నాసిరకం రాయి, కల్తీ ఇసుక, నాసిరకం సిమెంటు, వాడకంతో ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్లుగా బృందం గుర్తించింది. ఇంత నాసిరకంగా నిర్మాణం చేస్తున్న ఇళ్లను పేదలకు ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు జల్లులకే కూలిపోతుంటే ఒక మాదిరి గాలివానకు మొత్తం ఇల్లు నేలమట్టం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాసిరకపు ఇళ్లల్లో నివసించబోయే పేదలకు ప్రాణాలు దక్కుతాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చుక గూళ్లు, కాకుల గూళ్లు అయినా గట్టిగా ఉంటాయేమో కానీ జగనన్న ఇళ్లు మాత్రం పిట్టల గూళ్లు కంటే అన్యాయంగా ఉన్నాయన్నారు. ఇళ్లు కాదు ఊర్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఆచరణలో పేదలకు మృత్యు గృహాలను నిర్మిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని పేరుమీద అంతులేని అవినీతికి తెర తీశారన్నారు. వారి లక్ష్యం పేదలకు ఇళ్లు కాదని ఆ డబ్బును అప్పనంగా దిగమింగడమే అసలు లక్ష్యం అని ఈ ఇళ్ల నిర్మాణాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన బినా మీలతో నాసిరకపు ఇళ్లు కట్టించి పెద్ద మొత్తంలో ప్రజల సొమ్ము లూటీకి తెగబడ్డాడన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం చూస్తే పేదల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. క్యూరింగ్ పేరుతో బోర్లు వేసినట్లుగా బిల్లులు చేసుకున్నారని, మళ్లీ క్యూరింగ్ పేరుతో ట్యాంకర్లు తిప్పుతూ బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఆ ప్రయివేట్ ట్యాంకర్లకు మున్సిపల్ డ్రైవర్లను వాడుకుంటూ, పెద్ద ఎత్తున బిల్లులు చేసుకున్నారన్నారు. మున్సిపల్ ఖజానా అని, దోపిడీ దొంగలు లాగా దోచుకున్నారన్నారు. హౌసింగ్ బోర్డులో ఒక స్థాయి అధికారి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, నాసిరకపు ఇళ్లు కట్టి ప్రజల సొమ్మును నీకింత.. నాకింత.. పద్ధతిలో పంచుకున్నారన్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులు తక్షణమే తమ ఇళ్లను పరిశీలించి నాణ్యత గురించి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కూలుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణంపై, నాణ్యత ప్రమాణాలపై, అవినీతిపై, జగనన్న లేఅవుట్ పేరుతో జరిగిన అక్రమ గ్రావెల్‌పై సిట్టింగ్ జడ్జీితో విచారణ జరిపించాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది.