ప్రజాశక్తి-పెందుర్తి : పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న ఇళ్ల కాలనీని జనసేన నాయకులు పరిశీలించారు. 'జగనన్న ఇళ్లు -పేదలందరికి కన్నీళ్లు' అని నినదించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ, పేదల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకొని వారిని ఇబ్బందులకు గురిచేశారన్నారు. న్యాయస్థానానికి కూడా గౌరవం ఇవ్వకుండా కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల భూములను కొండ పోరంబోకుగా చిత్రీకరించి అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని తెలిపారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఒక్కలబ్ధిదారునికి అన్యాయం జరిగినా తమ పార్టీని సంప్రదిస్తే వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధు, శ్రీకాంత్, పిన్నింటి పార్వతి పాల్గొన్నారు.










