Nov 29,2022 23:49

తుప్పలతో నిండిన జగనన్న కాలనీ

పికె.పల్లిలో నేటికీ ప్రారంభం కాని పనులు
సౌకర్యాలు కల్పించినా ముందుకు రాని లబ్ధిదారులు
ప్రజాశక్తి -కోటవురట్ల :
మండలంలోని పికె.పల్లి గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో అక్కడ కేటాయించిన స్థలం తుప్పలు డొంకలతో నిండిపోయింది. గ్రామంలో ప్రధాన రహదారిని అనుకొని ఉన్న స్థలాన్ని కేటాయించినప్పటికీ లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే లేఅవుట్‌కు మంచినీటి సౌకర్యానికి బోరు ఏర్పాటు, విద్యుత్‌, రహదారి సౌకర్యాలను కల్పించినప్పటికీ ఎందుకో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడం లేదు.పికె.పల్లిలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలంలో 30 మంది లబ్ధిదారులకు ఇప్పటికవరకు ఇళ్లస్థలాలను మంజూరు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్క నిర్మాణమైనా ప్రారంభం కాలేదు. పెరిగిన ధరలతో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం ఎటూ సరిపోదని, ఇళ్లనిర్మాణాలు పూర్తయ్యేసరికి, సొంతిళ్లు మాట అటుంచితే అప్పులపాలైపోతామేమోనన్న గుబులుతోనే లబ్ధిదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.