
ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లిలో జగనన్న ఇళ్ల కాలనీ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 5,063 జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలో కానీ, లబ్ధిదారుల సొంత స్థలాల్లో నిర్మించే ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. సొంత స్థలాలలో ఇళ్లు నిర్మించుకోదలచిన వారికి ఎల్పీసీలు పెండింగ్లో ఉంటే వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉండి ఇళ్ల పట్టాలు రాని వారిని గుర్తించి, 90 రోజుల్లోగావారికి పట్టాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను 100 శాతం మంజూరు చేసామన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో టీవీలు ఏర్పాటు చేసేందుకు సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. మండలంలోని అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 1.30 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి అమర్నాథ్ వివరించారు.
ఉద్యోగుల గైర్హాజరు పై మంత్రి ఆగ్రహం
ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు కావడం పట్ల మంత్రి అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ మెమోలు చేయాలని అధికారులను ఆదేశించారు.