Dec 07,2022 00:01

మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి ఉదయశ్రీ

ప్రజాశక్తి-కోటవురట్ల: జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బిల్లులు సకాలంలో చెల్లించాలని పలువురు సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు కోరారు. మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి మాట్లాడుతూ, పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయ, సిబ్బందిని నియమించాలని, జగనన్న కాలనీ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. కొడవటిపూడి గ్రామ సర్పంచ్‌ అప్పారావు మాట్లాడుతూ, గ్రామంలో నిర్మిస్తున్న కాలనీ ఇళ్ల వద్ద నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా పలువురు గ్రామ సర్పంచులు కాలనీ ఇళ్ల స్థలాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో ఎవరికీ నిర్మాణం చేపట్టే ఉద్దేశం లేదని, వేరేచోట కొనుగోలు చేసి లబ్ధిదారులకు పట్టాలు అందజేయాలని కోరారు. దీనిపై స్పందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రస్తుతం స్థలాలు కొనుగోలు చేసే ఉద్దేశం, అవకాశం లేదన్నారు. నిర్మించుకునే వాళ్ళు సొంత స్థలాలు ఉంటే మంజూరు చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.. అనంతరం గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్‌ కరుణ, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ వర్మ మండలంలో చేపడుతున్న పనుల వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, బికేపల్లి ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, సర్పంచ్‌లు బివి రమణ, వరహాల బాబు, శివ, అనిల్‌ కుమార్‌, ఎరుకునాయుడు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.