May 17,2023 00:31
ఆవేదన వ్యక్తం చేస్తున్న కోటపాడు గ్రామ డ్వాక్రా గ్రూపు మహిళలు

ప్రజాశక్తి-పంగులూరు: జగనన్న చేయూత పథకం కింద వచ్చిన రుణమాఫీ డబ్బులను, తమ గ్రూపులకు రాయకుండా ఇబ్బంది పెడుతున్నారని కోటపాడు గ్రామ డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. అన్ని గ్రూపులకు చేయూత డబ్బులు వచ్చినా తమ గ్రూపులకు మాత్రం అధికారులు ఇంతవరకు అనుమతి ఇవ్వట్లేదని, కోటపాడు గ్రామంలోని అయిదు డ్వాక్రా గ్రూపు సంఘాలకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏడాది క్రితం ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని, ఓటిఎస్‌ డబ్బులు కట్టాలని, మండలంలోని అధికారులు తమపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. అయితే తాము కూలినాలి పనులు చేసుకుని బతికే వారమని, ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చెల్లించే స్తోమత తమకు లేదని చెప్పామన్నారు. అయినా తమ స్థలాలు మొత్తం సొంత స్థలాలని, ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కాదని చెప్పినా అధికారులు వినిపించుకోలేదని డ్వాక్రా మహిళలు తెలిపారు. అయితే మాకు తెలియకుం డానే మా గ్రూపులకు పనిచేసే వివోఏ సొంత డబ్బులు చెల్లించిందని చెబుతున్నారని, ఆ విషయం కూడా తమకు తెలియదని అన్నారు. మా సొంత స్థలాలకు ఓటీఎస్‌ ఎందుకని మహిళలు ప్రశ్నించారు. ఆమె చెల్లించిన డబ్బులు ఇవ్వలేదనే నెపంతో, జగనన్న చేయూత, రుణమాఫీ డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని డ్వాక్రా మహిళలు 'ప్రజాశక్తి'తో చెప్పారు. ఐదు డ్వాక్రా సంఘాలకు చెందిన 50 మంది మహిళలకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా చేయూత డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. 'ప్రజాశక్తి'తో మాట్లాడిన వారిలో డ్వాక్రా గ్రూప్‌ మహిళలు గంగవరపు రమాదేవి, గొల్లమూడి జయరాణి, గొల్లమూడి సమాధానం, ముట్లూరి మస్తానమ్మ, గొల్లపూడి నాగమ్మ, కలపాల తిరుపతమ్మ, గంగవరపు సలోమి, పాలపర్తి నాగమ్మ ఉన్నారు.