May 17,2023 23:49
ఏపిఎంతో మాట్లాడుతున్న కోటపాడు గ్రామ డ్వాక్రా మహిళలు

ప్రజాశక్తి-పంగులూరు: జగనన్న చేయూత ద్వారా తమకు వచ్చిన డబ్బులను వెంటనే ఇచ్చేటట్లు చూడాలని, కోటపాడు గ్రామ డ్వాక్రా మహిళలు కోరారు. ఇంటి స్థలాలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ పేరుతో, అధికారులు ఓటిఎస్‌ కింద డబ్బు చెల్లించని డ్వాక్రా మహిళల చేయూత డబ్బులు కోటపాడు డ్వాక్రా మహిళల ఎకౌంట్లో వేయకుండా, ఆపిన విషయం ప్రజాశక్తి పాఠకులకు తెలిసిందే. ఈ విషయమై ఐదు డాక్రా గ్రూపుల మహిళలు బుధవారం పంగులూరులోని, వెలుగు కార్యాలయానికి వచ్చి ఏపిఎం జ్యోతి ప్రసాద్‌ ను అడిగారు. తమకు తెలియకుండానే వివోఏ ఓటిఎస్‌ డబ్బులు చెల్లించానని, తాను చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేవరకు చేయూతకు సంబంధించిన డబ్బులను మీ అకౌంట్లో వేయనని చెబుతుందని అన్నారు. మా స్థలాలు ప్రభుత్వం ఇచ్చినవి కాదని, మా తాతల, తండ్రుల నుంచి రైతులు దగ్గర స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. కూలినాలి చేసుకొని బతికే తమకు ఓటిఎస్‌ వద్దని అప్పుడే చెప్పామని, అయితే వివోఏ తమ మాట వినకుండా తమ పేరుతో ఓటీఎస్‌ కట్టానని చెబుతున్నారన్నారు. గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు వేలిముద్ర వేయించుకోవడంలేదని, ఇప్పుడు చేయూత డబ్బులు అకౌంట్లో వేయలేదని అన్నారు. ఈ విషయమై ఏపీఎం జ్యోతి ప్రసాద్‌ మాట్లాడుతూ.. వివోఏ ఎస్తేరమ్మ మీరంతా డబ్బులు ఇస్తారని నమ్మకంతో తన సొంత డబ్బులను 54 వేల రూపాయలు ఓటీఎస్‌ కింద చెల్లించిందని, మీరంతా సానుకూలంగా స్పందించాలని అన్నారు. తాము వద్దన్నా ఆమె ఓటీఎస్‌ కట్టిందని, ఓటిఎస్‌ కట్టిన విషయం కూడా తమకు తెలియదని డ్వాక్రా మహిళలకు తెలిపారు. తాము ఓటిఎస్‌ డబ్బులు చెల్లించలేమని డ్వాక్రా మహిళలు గంగవరపు రమాదేవి, ముట్లూరి మస్తానమ్మ, గొల్లపూడి నాగమ్మ, గంగవరపు సలోమి, గొల్లపూడి సమాధానం, కలపాల తిరుపతమ్మ, పాలపర్తి నాగమ్మ తెలిపారు.
బలవంతపు ఓటిఎస్‌ తగదు
- సిపిఎం జిల్లా నాయకుడు, రాయిని వినోద్‌ బాబు
బలవంతపు ఓటీఎస్‌ తగదని సిపిఎం బాపట్ల జిల్లా నాయకుడు రాయినీ వినోద్‌ బాబు అన్నారు. కోటపాడు దళిత కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కాదని, అవి తాత ముత్తాతల కాలం నాడు రైతులు దగ్గర భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారని, అలాంటిది సొంత భూములకు ఓటీఎస్‌ చెల్లించమని వేధించటం సరైనది కాదన్నారు. ఉన్నతాధికారులు తమ ఆధికారాన్ని చాటుకునేందుకు, కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా పేదలపై ఓటీఎస్‌ను అమలు చేశారని, ఇది సరైనది కాదని అన్నారు. ఓటీఎస్‌ డబ్బుల పేరుతో జగనన్న చేయూత పథకం కింద వచ్చిన డబ్బులను ఆపటం దారుణమన్నారు. చట్టంలో లేని విషయాలను పేదలపై రుద్దే ప్రయత్నం చేయరాదని, ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని వినోద్‌ బాబు అన్నారు. ఇప్పటికైనా చేయూత డబ్బులను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయాలని, భవిష్యత్తులో కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదని వినోద్‌బాబు అన్నారు.