జగనన్న చేదోడు లబ్ది రూ.10.18 కోట్లు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
నాలుగో విడత జగనన్న చేదోడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్ధిక సాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సంబంధిత అధికారులతో, లబ్ధిదారులతో హాజరై సి.ఎం సమావేశ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలు అధిక వడ్డీలకు ఇతరులను ఆశ్రయించరాదని, ఆర్థికంగా వారు ఎదగాలనే సదుద్దేశ్యంతో కుల వత్తి చేసుకునే దుకాణాలు కలిగిన రజక, నాయీబ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం అర్హత కలిగిన లబ్ధిదారులకు సంవత్సరానికి 10 వేల చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాలు 40 వేలు అందిస్తున్న ఆర్థిక సహాయం జగనన్న చేదోడు అని, దాని ద్వారా వారి వత్తిని అభివద్ధి చేసుకునేందుకు వినియోగించుకోవాలని, చేదోడు నాల్గవ విడత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు.
జగనన్న చేదోడు 2020-21 సంవత్సరానికి గాను 8526 మంది లబ్ధిదారులకు రూ. 8.53 కోట్లు, 2021-22లో 9392 మంది లబ్ధిదారులకు రూ. 9.39 కోట్లు లబ్ధి చేకూరిందని, 2022-23లో 10813 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 10.81 కోట్లు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. అర్హత ఉండి ఎవరికైనా జగనన్న చేదోడు అందకుంటే వారు మళ్ళీ సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి సోషల్ ఆడిట్ అనంతరం వచ్చే జూన్, డిసెంబర్ నెలలో అర్హత మేరకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కుల, మత, వర్గ, పార్టీ వివక్షత లేకుండా పేద ప్రజల ఖాతాలలో నిష్పాక్షికంగా అవినీతికి తావు లేకుండా నేరుగా జమ చేసి ఆర్థికంగా అండగా ఉంటూ సంక్షేమం, అభివద్ధి ని సాకారం చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని 10,177 మంది లబ్ధిదారులకు రూ.10 వేల వంతున వ్యక్తిగత ఖాతాలకు జమ చేయనున్న మొత్తం సుమారు రూ.10.18 కోట్లు మెగా చెక్కును లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, సత్యవేడు ఎమ్మెల్యే తో కలిసి అందచేశారు. ఇందులో టైలర్స్ 6608 మందికి రూ. 6.61 కోట్లు, రజకులు 3315 మందికి రూ. 3.32 కోట్లు, నాయి బ్రాహ్మణులు 996 మందికి రూ. 1 కోటి లబ్ధి చేకూరనున్నదని తెలిపారు.
లబ్దిదారులకు మెగా చెక్ అందిస్తున్న కలెక్టర్










