Oct 09,2023 21:46

జగన్న సురక్షకార్యక్రమంలో చికిత్సలు చేయించుకునేందుకు వచ్చిన వృద్ధురాలితో మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేక అధికారి కెవిఎన్‌.చక్రధర్‌ బాబు

           సోమందేపల్లి : ప్రభుత్వం నిర్వహిస్తున్న జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని జగనన్నకు చెబుదాం, జిల్లా ప్రత్యేక అధికారి, ఏపీ జెన్కో ఎండి కెవిఎన్‌.చక్రధర్‌ బాబు తెలిపారు. సోమందేపల్లిలో జరుగుతున్న జగన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్‌ అరుణ్‌బాబుతో కలిసి సోమవారం పరిశీలించారు. సోమందపల్లి ఎంపిపి పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమం పేదలకు గొప్ప వరం లాంటిదని చెప్పారు. ప్రతి పేదవాడికీ వైద్యాన్ని వారి గడపవద్దకు చేర్చేందుకు ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చిందన్నారు. వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, గృహసారథులు గత 15 రోజుల నుండి ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇంటి వద్దనే బిసి, షుగర్‌ పరీక్షలు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో చాలామంది ప్రజలు ఆరోగ్య విషయంలో శ్రద్ధను చూపించలేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై ఇబ్బందులు లోనవుతున్నారన్నారు. దీనిని అధికమించడానికి ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లతో సర్వేచేయించి 7 రకాల వైద్య పరీక్షలతో వారి వ్యాధిని గుర్తించి ప్రత్యేకమైన యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రత్యేకమైన డాక్టర్లతో వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండల పరిధిలోని చాకర్లపల్లి హౌసింగ్‌ లేఅవుట్‌, మాగేచెరువు గ్రామ సచివాలయం భవన నిర్మాణం పనులను పరిశీలించారు. సోమందేపల్లి జిఎస్‌ కాలనీ ఎంపిపి పాఠశాల జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్‌వి.కృష్ణారెడ్డి, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, డిఇఒ మీనా, ఎంపిపి గంగమ్మ, సర్పంచి గంగాదేవి, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ మంజులా దేవి, తహశీల్దార్‌ సురేష్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.