ప్రజాశక్తి - కురుపాం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్ద కే వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి బి. సత్యనారాయణ అన్నారు. మండలంలో వలసబల్లేరు సచివాలయంలో సోమవారం జరిగిన ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వైద్య అధికారులు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని నర్సిపురంలో ఈనెల 10వ తేదీన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ జిజె ప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు స్వదినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సీతంపేట : మండలంలో కిండంగి సచివాలయంలో సోమవారం ఎంపిడిఒ కె.గీతాంజలి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ గీతాంజలి మాట్లాడుతూ ఏడు రకాల వైద్య పరీక్షలు 117 రకాల మందులు ఉన్నాయ న్నారు. గిరిజన ముంగిట్లోకే వైద్యం వచ్చిందని, దీన్ని వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారి రవీంద్ర కుమార్ కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేదలకు వరం లాంటిదని ఎంపిపి కుంబిరిక దీనమయ్య అన్నారు. మండలంలోని డుమ్మంగి గ్రామంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి దీనమయ్య, సర్పంచి పాలక క్రాంతికుమార్ ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సాల్మన్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వైద్యులు బుద్దేశ్వర రావు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని నీలానగరంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు పి ఉమామహేశ్వరి, ఏ మానస, వెంకటరమణ తదితరులు ఆరోగ్య తనిఖీలు నేత్ర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వావిలపల్లి పురుషోత్తంనాయుడు, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, సచివాలయ, వైద్య సిబ్బందితో పాటు గ్రామ వాలంటీరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్: మండలంలోని కురుకుట్టిలో సోమవారం వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, సర్పంచులు అప్పారావు, ఆదయ్య, నూకయ్య, ఎంపిటిసి సుబ్బారావు, తొనం పిహెచ్‌సి వైద్యులు సుజాత, సచివాలయం, అంగన్వాడి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాచిపెంట: రాష్ట్రంలో పేదల ముంగిటికే ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత సిఎం జగన్ మోహన్‌రెడ్డిదేనని ఎంపిపి బి.ప్రమీల పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఖరీదైన వైద్యం అందించాలనేదే ఈ ప్రభుత్వం ఆలోచన అన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బాబ్జీ, వైస్ ఎంపిపి మీసాల నారాయణ, మజ్జి వెంకట్రావు, మీసాల చంటి, మర్రి ఉమా, పాచిపెంట శ్రీనివాసరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ శివకుమార్, ఎంపిడిఒ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
తాగునీరు లేక అవస్థలు
మక్కువ: గత నెల రోజులుగా తాగునీటి కోసం చాలా అవస్థలు పడాల్సి వస్తుందని మండలంలోని దబ్బగడ్డ పంచాయతీ పరిధిలోని నాగుల్లు, దబ్బగడ్డ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కేంద్రంలో సోమవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి వచ్చిన ఎంపిడిఒ సూర్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న ఎంపిపి మర్రి పారమ్మను కూడా ఈ సందర్భంగా కలిసి విజ్ఞప్తి చేశారు గ్రామంలో ఎనిమిది కొలాయి పాయింట్లు ఉన్నప్పటికీ తాగునీరు రాక బోసిపోయి దర్శనమిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని గ్రామానికి చెందిన యువకులు వెంకట్ ప్రభాకర్ తదితరులు కోరారు.










