Oct 10,2023 19:40

జగనన్న ఆరోగ్య సురక్షతో కార్పోరేట్‌ వైద్యసేవలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందుతోందని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. మంగళవారం నగర పాలక సంస్థ మురకంబట్టు పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని చక్కెర కర్మాగారం కళ్యాణ మండపంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని కమిషనర్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ స్థానిక కార్పొరేటర్లతో కలిసి వైద్యశిబిరంలో అన్ని కౌంటర్లను, వైద్యవిభాగాలను పరిశీలించారు. శిబిరానికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని, టోకెన్లు పొందినవారు నిర్దేశించిన కౌంటర్లకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకునేలా సిబ్బంది సాయం చేయాలన్నారు. ప్రజలకు ఓపిగ్గా వైద్యసేవలు అందించాలని సూచించారు. అందుతున్న వైద్యసేవలపై పలువురు మహిళలు, వద్ధులతో మాట్లాడారు. అనంతరం ఐసీడీఎస్‌, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, డిప్యూటీ మేయర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్‌, స్వరూప రాణి, సునీత, నవీన్‌, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, సీఎంఎం గోపి, ఏసీపీ రామకష్ణుడు, నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.