Sep 12,2023 21:16

డెంకాడ: మాట్లాడుతున్న ఎంపిపి వెంకటవాసుదేవరావు

ప్రజాశక్తి - తెర్లాం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో జగనన్న సురక్ష కార్యక్రమంపై ఎంపిడిఒ ఎస్‌.రామకృష్ణ మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు అన్ని సచివాలయాల పరిధిలోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా 15 తేదీన వాలంటీర్లు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారని, 16 తేదీ నుండి ఎఎన్‌ఎం, సిహెచ్‌ఒలు ఆరోగ్యసర్వే పక్కగా నిర్వహించాలని, దానికి పంచాయతీ కార్యదర్శులు నిత్య పర్వవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతీ గృహానికి సంబంధించి 9 రకాల ప్రశ్నలతో కూడిన సర్వే చేయాలన్నారు. జ్వరం, ఏమైనా వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భవతులుగా ఉన్నపుడు ఏమైనా సమస్యలు, దృష్టి లోపం, దంత సమస్యలు, రెండు వారములకు మించి దగ్గు, స్పర్శ లేని మచ్చలు, నవజాతి శిశువులు తదితర అంశాలపై సర్వే ఉంటుందన్నారు. అవసరమైన వారికి 14 రకాల మెడికల్‌ టెస్టులు చేయబడతాయన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ జే త్రినాధరావు, ఐసిడిఎస్‌ పిఒ కె రాజ్యలక్ష్మి, డాక్టర్‌ మాధవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జామి: ఈ నెల 30 తేదీ నుంచి అక్టోబర్‌ 25 వరకు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ సతీష్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సురక్ష శిబిరాల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంభందించి 16 తేదీ నుంచి వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు ద్వారా సర్వేలు నిర్వహిస్తారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు పెట్టీ, ఆరోగ్య తనిఖీలు, మందులు పంపిణీ చేపడతారని అన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డెంకాడ: ఈ నెల 30 నుంచి నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పై మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారని ఈ సర్వేన ప్రతి ఒక్కరు వినియోగించుకుని తమ ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలను తెలుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపారాణి, తహశీల్దార్‌ పి. ఆదిలక్ష్మి, ప్రాథమిక వైద్యాధికారి ఎం లావణ్య ఐసిడిఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేపాడ: స్థానిక వైకెపి కార్యాలయంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమంపై ఎంపిడిఒ పట్నాయక్‌ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఎంఎల్‌ఒలు, ఎంఎల్‌హెచ్‌పిలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ధరణి, సిహెచ్‌ఒ ఆంజనేయులు, వెంకటరావులు పాల్గొన్నారు.