Sep 13,2023 22:56

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ పి.రాజా బాబు, జాయింట్‌ కలెక్టర్‌ డా.అపరాజిత సింగ్‌ తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఈ కార్యక్రమ నిర్వహణపై జిల్లా వైద్యాధి కారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుకు గ్రామాలతో పాటు పట్టణాలలో వైద్యులు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను సిద్ధం చేయాలన్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసి సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా రూపుదిద్దాలన్నారు. ఈ కార్యక్రమం 5 దశలలో జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌ 30న హెల్త్‌ క్యాంపు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి 15 రోజులు ముందు అనగా సెప్టెంబర్‌ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు గ్రామంలోని ఇంటింటిని సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించాల్సి ఉంటుం దన్నారు. సేకరించిన ఆయా వివరాల ఆధారంగా ఆ రోజు హెల్త్‌ క్యాంపులో వైద్యం అవసరమైన వారికి డాక్టర్ల చేత చికిత్స చేసి మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఆయా మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు ఈ మెడికల్‌ క్యాంప్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. జీ.గీతాబాయి, ఐసిడిఎస్‌ పీడీ ఎస్‌.సువర్ణ, డీపీఓ నాగేశ్వరనాయక్‌, డీఈఓ తాహెరా సుల్తానా, ఇతర అధికారులు కలెక్టర్‌ తో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.