ప్రజాశక్తి - పార్వతీపురం : జగనన్న ఆరోగ్య సురక్ష పథకం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైన వారికి గ్రామాల్లోనే ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించడం, పెద్దాస్పత్రులకు సిఫార్సు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని రూపకల్పన చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు వారి పరిధిలోని అన్ని కుటుంబాలను సందర్శిస్తారన్నారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఎఎన్ ఎంలు, క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారని చెప్పారు. ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ఇంటింటికీ వెళ్లి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. గ్రామాల్లో, వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు.ఈ వైద్య శిబిరాలకు స్పెషలిస్టు డాక్టర్లు ఇద్దరు, మండలంలోని పిహెచ్‌సి డాక్టర్లు ఇద్దరు హాజరు అవుతారని, రోగులకు అక్కడికక్కడే శిబిరంలో చికిత్స అందజేస్తారని అన్నారు. ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు. అవసరమైన వారిని పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స కోసం సిఫారుసు చేస్తారని వెల్లడించారు. ఆరోగ్య శిబిరాలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుండి ఒక స్పెషలిస్టు డాక్టర్ హాజరవుతారని చెప్పారు. నెల రోజులపాటు ప్రతి రోజూ శిబిరాలు జరుగుతాయన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రోజూ వైద్య శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. దీనివల్ల గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి గ్రామాల్లోనే స్పెషలిస్టు వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండలాలలో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్‌సీల వైద్యాధికారులను కార్యక్రమ నిర్వహణకు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆరోగ్య అధికారి, యూపీహెచ్‌సీ వైద్యాధికారులను బాధ్యులను చేస్తున్నామన్నారు.
అందుబాటులో మందులు, వైద్య పరికరాలు
వైద్య శిబిరం జరుగుతున్న ప్రతి చోటా ఔషధాలు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. అన్ని రకాల వైద్య పరికాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంపై వాలంటీర్లు, ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలకు ప్రత్యేక శిక్షణ వెంటనే ఇవ్వాలని చెప్పారు. శిబిరాలకు వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. వైద్య పరీక్షలు పక్కాగా జరగాలన్నారు. ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
16 నుంచి ఎఎన్‌ఎంల సందర్శన
ఇంటింటికి వాలంటీర్ల సందర్శన ఈనెల 15 నుంచి మొదలు కావాలని ఆయన చెప్పారు. ఎఎన్‌ఎంల సందర్శన ఈనెల 16న ప్రారంభంకావాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు పి.కిరణ్ కుమార్, కె.రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పల నాయుడు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










