
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, డిఎంహెచ్‌ఒ డి.మహేశ్వరరావు, డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, డిఇఒ ఆర్.వెంకటరమణ, ఇన్‌ఛార్జి డిసిహెచ్ ఎస్‌పి.సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ప్రారంభం కంటే ముందు మూడు దశల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తొలిదశలో గృహసారథులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇంటింటా ప్రచారం, రెండో దశలో ఎఎన్‌ఎం, సిహెచ్‌ఒలు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. మూడో దశలో క్యాంపులు ప్రయోజనాలను వివరించడం, నాలుగో దశలో క్యాంపులు నిర్వహించడం చేయాల్సి ఉందన్నారు. ఈనెల 25న జిల్లాలో పట్టణ ప్రాంతంలో ఒకటి, గ్రామీణ ప్రాంతంలో ఒకటి మొత్తం రెండు పైలట్ క్యాంపులను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. క్యాంపులకు అవసరమైన భవనాలను ముందుగా గుర్తించాలన్నారు. జనరల్ కన్సల్టెన్సీ, చిల్డ్రన్ కన్సల్టెన్సీ, గైనిక్ కన్సల్టెన్సీ, టెలి కన్సల్టెన్సీ అనే నాలుగు విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు క్యాంపుల ఏర్పాటు బాధ్యతలను తీసుకోవాలన్నారు. తాగునీటి ఏర్పాటుతోపాటు, క్యాంపునకు హాజరై పరీక్ష చేయించుకునే వారికి భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. డిపిఒ జివికె మల్లికార్జునరావు, ఐసిడిఎస్ పీడీ బి.సుజాతారాణి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నరసాపురం, భీమవరం, తణుకు మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.